Share News

2 నెలల్లో టీచర్ల విభజన!

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:22 AM

రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుచేస్తూ ఉపాధ్యాయుల విభజనపై పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. జిల్లా పరిషత్‌, ప్రభుత్వ, మున్సిపల్‌ పాఠశాలల సర్వీస్‌ రూల్స్‌ ఇప్పటికే విడుదలయ్యాయి.

2 నెలల్లో టీచర్ల విభజన!
Teacher

  • జిల్లా మారితే ఆర్డర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌.. అదే జిల్లాలో ఉంటే ఆర్డర్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌

  • స్పౌజ్‌ కోటాలో మారితే సీనియారిటీ పోతుంది.. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు చర్యలు

  • క్యాడర్‌ స్ర్టెంథ్‌ జీవోలు వచ్చాక టీచర్ల నుంచి ఆప్షన్లు..

  • ఈలోగా కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుచేస్తూ ఉపాధ్యాయుల విభజనపై పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. జిల్లా పరిషత్‌, ప్రభుత్వ, మున్సిపల్‌ పాఠశాలల సర్వీస్‌ రూల్స్‌ ఇప్పటికే విడుదలయ్యాయి. దీంతో తదుపరి కార్యాచరణపై విద్యాశాఖ దృష్టిసారించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో జిల్లా పరిషత్‌, ప్రభుత్వ, మున్సిపల్‌ మేనేజ్‌మెంట్ల స్కూళ్లలో 1.61లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారందరినీ ఇప్పుడు విభజించాల్సి ఉంది. తొలుత ఆప్షన్లు స్వీకరించి సీనియారిటీ ఆధారంగా అలాట్‌మెంట్‌ ఆర్డర్లు జారీచేస్తారు. అనంతరం అభ్యంతరాలు స్వీకరించి మార్పులు చేస్తారు. మున్సిపల్‌ టీచర్ల సర్వీస్‌ రూల్స్‌పై మరో రెండు జీవోలు విడుదలయ్యాక ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కేడర్‌ మేనేజ్‌మెంట్‌(ఓఎల్‌ఎం) వివరాలు అప్‌లోడ్‌ చేసి వివరాలను సీఎఫ్ఎంఎస్ కు పంపుతారు. ఆ తర్వాత పోస్టుల కేటాయింపు మాడ్యుల్‌ వివరాలు సమర్పిస్తారు. ఆ వివరాల ఆధారంగా ఆర్థిక శాఖ 26 జిల్లాల కేడర్‌ స్ర్టెంథ్‌ల జీవోలు వేర్వేరుగా విడుదల చేస్తుంది.అప్పటినుంచి పాఠశాల విద్యాశాఖ కీలక చర్యలు ప్రారంభిస్తుంది. ప్రాథమిక సీనియారిటీ జాబితాలు విడుదల చేసి, వాటిపై అభ్యంతరాలు స్వీకరించి అనంతరం తుది సీనియారిటీ జాబితాలు విడుదల చేస్తారు. ఆ తర్వాత ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తుంది. తొలుత ప్రాధాన్యతా కేటగిరీల నుంచి ఆప్షన్లు తీసుకుంటుంది. అంధులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలున్న వారు, వితంతువులు, గుండె సర్జరీలు చేయించుకున్నవారు, క్యాన్సర్‌తో బాధితులు, కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారి నుంచి తొలుత ఆప్షన్లు తీసుకుంటారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ టీచర్ల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు


. అనంతరం వారి సీనియారిటీ ఆధారంగా అదే జిల్లాకు టీచర్‌ను కేటాయిస్తే ఆర్డర్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ ఇస్తారు. ఒకవేళ టీచర్‌ జిల్లా మారితే ఆర్డర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఇస్తారు. జిల్లా మారిన టీచర్లు ఆర్డర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌తో పాటు కొత్త జిల్లాలో పోస్టింగ్‌ పొందుతారు. దానినే బదిలీగా భావించాలి. ఆర్డర్స్‌ తీసుకున్న తర్వాత టీచర్లకు దానిపై వినతులు సమర్పించే అవకాశం కల్పించనున్నారు. వారి వినతులను పరిశీలించి అధికారులు పరిష్కరిస్తారు. ఒకవేళ టీచర్‌ వినతికి అనుగుణంగా చర్యలు చేపడితే మరో టీచర్‌ను ఆ జిల్లా నుంచి కదిలించాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి కోటాలో ఎవరైనా జిల్లా మారితే వారు సీనియారిటీని కోల్పోతారు. ఓవైపు ఈ ప్రక్రియ జరుగుతుండగానే మరోవైపు 3 వేల పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారు. కొత్తగా ఉద్యోగ నియామకాల్లో స్థానికతను తీసుకుంటారు. అందువల్ల కొత్తగా వచ్చే టీచర్లకు కేటాయింపు సమస్య తలెత్తదు. వారు స్థానికులుగా నిర్థారించుకున్న జిల్లాల్లోనే నియామకం అవుతారు. షెడ్యూలు ప్రకారం ఈనెల 15న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. రాష్ట్రపత్తి ఉత్తర్వుల అమలు నేపథ్యంలో కొన్ని రోజులు ఆలస్యంగా విడుదల చేయనున్నారు.

స్పెషల్‌ సర్వీస్‌ రూల్స్‌

కేడర్ల వారీగా సాధారణ పరిపాలన శాఖ జీవోలు విడుదల చేస్తోంది. అయితే విద్యాశాఖ అంతర్గతంగా ఉన్న అంశాల ఆధారంగా ప్రత్యేకంగా సర్వీస్‌ రూల్స్‌ రూపొందించనున్నారు. ఉపాధ్యాయులకు తప్పనిసరిగా టెట్‌ అర్హత లాంటి అంశాలు అందులో చేర్చనున్నారు.


మున్సిపల్‌ స్కూళ్లలో కేడర్లపై జీవోలు

మున్సిపల్‌ పాఠశాలలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాలల్లో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా టీచర్ల కేడర్‌ పునర్‌వ్యవస్థీకరిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్లు, మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎం లేదా స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, గ్రేడ్‌-2 భాషా పండితులు, ఆర్ట్‌ టీచర్‌, క్రాఫ్ట్‌ టీచర్‌, మ్యూజిక్‌ టీచర్‌, వీవింగ్‌ టీచర్‌, ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, టైలరింగ్‌ టీచర్‌ పోస్టులు జిల్లాస్థాయిలో ఉంటాయి. వీరికి డీఈవో నియామకాధికారిగా ఉంటారు. గ్రేడ్‌-2 హెచ్‌ఎం పోస్టు జోనల్‌ స్థాయిలో ఉంటుంది. ఆర్జేడీ నియామకాధికారిగా ఉంటారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటాలో స్థానికులకు 95శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుంది. విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీచర్లకు ప్రత్యేక సర్వీస్‌ రూల్స్‌ ఉన్నాయి. వాటికి సాధారణ పరిపాలనశాఖ వేర్వేరు జీవోలు ఇవ్వాలి. కాగా, ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ఆర్డర్‌ కింద కొత్త జిల్లాకెళ్లిన టీచర్‌కు స్టేషన్‌ పాయింట్లు ఎలా లెక్కిస్తారనే దానిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రకృతి సాగులో ఏపీ నంబర్‌ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 05 , 2026 | 04:23 AM