ప్రత్యేక టెట్‌కు దరఖాస్తుల వెల్లువ
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:41 AM
ఇన్ సర్వీస్ టీచర్ల కోసం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక టెట్‌కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం వరకు 58,547 మంది టీచర్లు 70,920 పేపర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఈ నెల 24 వరకు దరఖాస్తులకు గడువు ఉంది.
70,920 పేపర్లకు 58,547 మంది దరఖాస్తు
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఇన్ సర్వీస్ టీచర్ల కోసం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక టెట్‌కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం వరకు 58,547 మంది టీచర్లు 70,920 పేపర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఈ నెల 24 వరకు దరఖాస్తులకు గడువు ఉంది. ఇటీవల విడుదలైన సాధారణ టెట్‌లో 37,789 మంది, గతేడాది జరిగిన సాధారణ టెట్‌లో 15,239 మంది అర్హత సాధించారు. దీంతో సుమారు మరో 34,500 మంది టీచర్లు అర్హత సాధిస్తే సరిపోతుందని అధికారులు అంచనా వేశారు. కానీ, అనూహ్యంగా ప్రత్యేక టెట్‌కు 58,547 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గతేడాది 15,239 మంది టెట్ అర్హత సాధించిన తర్వాత... ఇంకా 72,230 మంది టీచర్లకు టెట్ అవసరం అని పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. వారిలో 37,789 మంది ఈ ఏడాది జూన్ టెట్‌లో అర్హత సాధించారు. అందులోనూ ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి టెట్ నుంచి మినహాయింపు ఉంది. స్పెషల్ టెట్‌తో దాదాపుగా రాష్ట్రంలో టెట్ అర్హత సమస్య తీరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2028 నాటికి దేశవ్యాప్తంగా టీచర్లంతా టెట్ అర్హత సాధించాలి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టెట్ నిర్వహిస్తోంది.
దరఖాస్తు రుసుముల రీఫండ్‌కు గడువు పెంపు
యూనివర్సిటీ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు రుసుముల రీఫండ్ గడువును ఈ నెల 28 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యాశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2023లో జారీ అయిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని అప్పట్లో ఫీజులు చెల్లించిన వారికి ఆ ఫీజులను ప్రస్తుత నోటిఫికేషన్ల దరఖాస్తు ఫీజులతో సర్దుబాటు చేస్తున్నారు. లా అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్: న్యాయ విద్యా కోర్సుల్లో(లా) అడ్మిషన్లకు ఉన్నత విద్యాశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. 24 నుంచి 29 వరకు దరఖాస్తులను తీసుకుంటారు. 25 నుంచి వచ్చే నెల 2 వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. 29 నుంచి వచ్చే నెల 2 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. 3న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుంది. అక్టోబరు 6న సీట్లు కేటాయిస్తారు. 7 నుంచి కాలేజీల్లో రిపోర్టు చేయాలి.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం