Share News

ఇక ఆన్‌లైన్‌లో ఓసీ!

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:16 AM

భవన నిర్మాణాల విషయంలో మున్సిపల్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) జారీ, భవన నిర్మాణ అనుమతుల సమయంలో తనఖా పెట్టిన ఆస్తుల విడుదల ప్రక్రియను మరింత సరళీకృతం చేసింది

ఇక ఆన్‌లైన్‌లో ఓసీ!
ap govt

  • ఇక ఆన్‌లైన్‌లో ఓసీ!

  • ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ సరళీకృతం

  • తనఖా ఆస్తుల విడుదల ప్రక్రియ కూడా..

  • 10 శాతం లోపు నిర్మాణ వ్యత్యాసాలకు ఆటోమేటిక్‌ క్రమబద్ధీకరణ

    దరఖాస్తు చేసిన 21 రోజుల్లో ఫైర్‌ ఎన్‌వోసీ రాకున్నా నిబంధనల మేరకు ఓసీ జారీ

  • నిర్మించిన భవనాన్ని అధికారులు 15 రోజుల్లో తనిఖీ చేయకపోతే ఓసీకి ఆమోదం

అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణాల విషయంలో మున్సిపల్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) జారీ, భవన నిర్మాణ అనుమతుల సమయంలో తనఖా పెట్టిన ఆస్తుల విడుదల ప్రక్రియను మరింత సరళీకృతం చేసింది. ఇకపై ఆన్‌లైన్‌ విధానంలోనే ఓసీ జారీతో పాటు తనఖా విడుదల ప్రక్రియను చేపట్టేలా ఆదేశాలు జారీచేసింది. ఉత్తర్వుల ప్రకారం.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కోసం ఏపీ డెవల్‌పమెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏపీడీపీఎంఎస్‌) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ భవన నిర్మాణ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు, వివరాలను అప్‌లోడ్‌ చేయాలి. ఆటోమేటిక్‌ స్ర్కూటినీ వ్యవస్థ అప్‌లోడ్‌ చేసిన నిర్మాణ ప్రణాళికను ఇప్పటికే మంజూరైన ప్లాన్‌తో పోల్చి చూస్తుంది. నిర్మాణం సెట్‌ బ్యాక్‌లు, భవనం ఎత్తు, అంతస్తుల సంఖ్య, నిర్మిత విస్తీర్ణం తదితర అంశాల్లో ఉన్న వ్యత్యాసాలను సాఫ్ట్‌వేర్‌ గుర్తిస్తుంది. 10 శాతం మించని వ్యత్యాసాలను ఏపీడీపీఎంఎస్‌ ద్వారానే క్రమబద్ధీకరించి, చెల్లించాల్సిన ఫీజును లెక్కిస్తారు. అయితే 10 శాతానికి మించిన వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో దరఖాస్తును తిరస్కరిస్తారు. ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్‌ అవసరమైన భవనాలకు సంబంధించి దరఖాస్తుదారులు ఏపీడీపీఎంఎస్‌ సమగ్ర వ్యవస్థ ద్వారా అగ్నిమాపక శాఖకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసిన 21 రోజుల్లోగా ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్‌ జారీ కాకపోతే, వర్తించే డీమ్డ్‌ నిబంధనల ప్రకారం ఓసీ దరఖాస్తును పరిశీలించి, సర్టిఫికెట్‌ జారీచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ముందస్తు తనిఖీ అవసరం లేదు

అవసరమైన పత్రాలు, ఇతర నిబంధనలు పూర్తయిన తర్వాత భవనాన్ని ముందుగానే భౌతికంగా తనిఖీ చేయకుండానే, తనిఖీ నివేదిక కోసం వేచి ఉండకుండానే ఏపీడీపీఎంఎస్‌ ద్వారా ఓసీ జారీచేస్తారు. అనంతరం సంబంధిత మున్సిపాలిటీ లేదా పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు భవనాన్ని తనిఖీ చేస్తారు. ఓసీ జారీ అనంతరం నిర్వహించే తనిఖీ, ధ్రువీకరణ ప్రక్రియను సంబంధిత అధికారులు 15 రోజుల్లో పూర్తి చేయాలి. గడువులో అధికారులు ధ్రువీకరించకపోతే ఓసీ ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తారు. గడువులోగా తనిఖీ పూర్తి చేయని అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీచేసే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భవన నిర్మాణ అనుమతి సమయంలో తనఖా పెట్టిన నిర్మిత విస్తీర్ణానికి సంబంధించిన కేసుల్లో ఓసీ జారీతో పాటు తనఖా విడుదల ప్రక్రియ చేపడతారు. తనఖా ఆస్తి వివరాలతో విడుదల లేఖ, తనఖా విమోచన పత్రాన్ని రూపొందిస్తారు. సంబంధిత మున్సిపల్‌ కమిషనర్‌, పట్టణాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్‌పర్సన్‌ డిజిటల్‌ సంతకం చేసిన పత్రాలను ఏపీడీపీఎంఎస్‌ నుంచి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు చెందిన ఐజీఆర్‌ఎస్‌ పోర్టల్‌కు పంపిస్తారు. సబ్‌ రిజిస్ట్రార్‌ అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి తనఖా విడుదల వివరాలను తిరిగి పంపిస్తారు. దరఖాస్తుదారుడు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తనఖా విడుదల కోసం ప్రత్యేకంగా మరో దరఖాస్తు చేయాల్సిన అవసరముండదు. దశల వారీగా నిర్మిస్తున్న ప్రాజెక్టులో అన్నివిధాలా పూర్తయిన స్వతంత్ర బ్లాక్‌ లేదా భవనానికి పాక్షిక ఓసీ జారీచేయవచ్చు. మొత్తం భవనం లేదా బ్లాకుల నిర్మాణం పూర్తయి, పూర్తి విస్తీర్ణానికి ఓసీ జారీ అయిన తర్వాతే తనఖా విడుదల చేస్తారు.

తప్పుడు వివరాలిస్తే చర్యలు: నిర్మాణ ప్రణాళికలు, పత్రాల్లో తప్పుడు వివరాలు లేదా వాస్తవాలను దాచిపెడితే దరఖాస్తుదారుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్‌ (ఎల్‌టీపీ) తప్పుడు డ్రాయింగ్‌లు లేదా పత్రాలు సమర్పించినా, బకాయిల విషయంలో అవకతవకలు గుర్తించినా, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు లాగిన్‌ను నిలిపివేసే చర్యలు చేపడతారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

Updated Date - Oct 19 , 2026 | 04:16 AM