పరిమితికి లోబడే ఎన్నికల ఖర్చు
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:43 AM
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్ణయించిన వ్యయానికి మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు చేయరాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్ణయించిన వ్యయానికి మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు చేయరాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా స్పష్టం చేశారు. 28 జిల్లాలకు వ్యయ పరిశీలకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఆయన.. శుక్రవారం వారితో సమావేశమయ్యారు. అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రోజువారీ ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సదరు అభ్యర్థికి ఎన్నికల వ్యయాన్ని నమోదు చేయడానికి కావలసిన నిర్దిష్ట నమూనాలను ఉచితంగా నిర్ణీత సమయంలో అందజేసేలా రిటర్నింగ్ అధికారులకు మార్గనిర్దేశం చేయాలని పరిశీలకులను కోరారు.
ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోపు.. పోటీచేసిన ప్రతి అభ్యర్థీ తన మొత్తం ఎన్నికల ఖర్చు వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి తప్పనిసరిగా సమర్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నిర్వహణ తీరుకు సంబంధించి అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు, సామాన్య ప్రజలకు ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా జాగ్రత్త వహించాలని.. శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ ముగిసే 48 గంటల నుంచి.. పంచాయతీల్లో 44 గంటల ముందు నుంచి మద్యం సరఫరా నిలుపుదల చేయాలని ఆదేశించారు. పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అక్రమ మద్యం సరఫరా, అమ్మకాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు