Share News

నాడు తప్పుటడుగులు.. నేడు తిప్పలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:04 AM

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు, క్యాడర్‌, ప్రమోషన్‌ తదితర అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడం ఇప్పుడు ఉద్యోగులకు సమస్యగా మారింది. దానివల్ల సచివాలయాల ఉద్యోగులు చాలామంది సంవత్సరాల తరబడి ఒకే స్థాయిలో కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నాడు తప్పుటడుగులు.. నేడు తిప్పలు

  • సచివాలయాల ఏర్పాటులో జగన్‌ హడావుడి

  • సర్వీస్‌ రూల్స్‌ విస్మరించడంతో ఇప్పుడు ఉద్యోగులకు కష్టం

  • క్యాడర్‌ నుంచి ప్రమోషన్ల వరకు చిక్కులు

  • నోషనల్‌ ఇంక్రిమెంట్లపై ఉద్యోగుల పట్టు

  • ఆర్థిక భారమని యోచిస్తున్న సర్కారు

(అమరావతి - ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు, క్యాడర్‌, ప్రమోషన్‌ తదితర అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడం ఇప్పుడు ఉద్యోగులకు సమస్యగా మారింది. దానివల్ల సచివాలయాల ఉద్యోగులు చాలామంది సంవత్సరాల తరబడి ఒకే స్థాయిలో కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు లక్ష మంది ఉన్నత చదువులు చదివిన ఉద్యోగులు రికార్డు అసిస్టెంట్‌ స్థాయి పోస్టుల్లోనే ఉండిపోయారు. అప్పటి జగన్‌ ప్రభుత్వం కేవలం సచివాలయ వ్యవస్థ ఏర్పాటుపైనే దృష్టి పెట్టిందిగానీ, ఉద్యోగుల సర్వీసురూల్స్‌ విషయం పట్టించుకోకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత ఈ సమస్యకు చాలా వరకు పరిష్కారం చూపింది. ఒకటి, రెండు శాఖలకు సంబంధించిన సచివాలయ ఉద్యోగులకు తప్ప మిగిలిన 11 క్యాడర్లలో పదోన్నతి చానళ్లను సృష్టించింది.


ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి కూడా పదోన్నతి చానల్‌ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. పెండింగ్‌ ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది. 18 క్యాడర్లలో 14,431 మందికి ఇప్పటికే పదోన్నతులు ఇచ్చామని, మరో 800 మందికి కూడా ఇవ్వనున్నామని ప్రభుత్వం పేర్కొంటోంది. జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌...సచివాలయ ఉద్యోగులకు ఇవ్వడం వల్ల ఆయా శాఖల్లో ఉద్యోగులపై ప్రభావం ఉంటుందని, దానికి ప్రత్యామ్నాయంగా ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం ద్వారా అర్హులైన వారికి జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి పేస్కేల్‌ పొందే అవకాశముందని చెబుతోంది. ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి ఈ స్కీమ్‌ కింద ప్రత్యేక గ్రేడ్‌ పేస్కేల్‌ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని సచివాలయాల్లో సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులపై అధిక పనిభారం పడుతోందని సంఘాలు చెబుతున్నాయి. దీనిపై జిల్లా స్థాయిలో కమిటీను ఏర్పాటుచేసి పనిభారం అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

నోషనల్‌ ఇంక్రిమెంట్లపైనే పేచీ....

ప్రారంభ నియామకాల సమయంలో స్టైపెండ్‌పై పనిచేసిన కాలాన్ని రెగ్యులర్‌ సర్వీసులో ఎలా పరిగణించాలన్నదానిపైఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం భిన్న స్వరం వినిపిస్తున్నాయి. ఉద్యోగుల డిమాండ్‌తో రాష్ట్రంపై ఆర్థికభారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల నియామకం సమయంలోని మొదటి రెండేళ్ల స్టైపెండ్‌, ఆ తర్వాత రెగ్యులరైజ్‌ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల స్కేల్‌ ఇస్తామని చెబుతోంది. అయితే ప్రొబేషన్‌ పీరియడ్‌కూ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్‌ ఆమోదయోగ్యం కాదని, రాష్ట్రంలో మిగిలిన ఐదు లక్షల మంది ఉద్యోగులపైనా ఈ ప్రభావం పడుతుందని అధికారులు అంటున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,500 కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల దాకా భారం పడుతుందని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రస్తుతం అంత శక్తిలేదని అంటున్నారు.


భారం పెరిగింది...క్యాడర్‌ మాత్రం అదే...

సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు, వివిధ శాఖల పనులు క్షేత్రస్థాయిలో నిర్వహించే బాధ్యతలు తమకు పెరిగాయని ఉద్యోగులు చెబుతున్నారు. అదే స్థాయిలో సిబ్బంది, పోస్టులు, క్యాడర్లను ఎప్పటికప్పుడు పునర్యవస్థీకరించడం లేదని వాదిస్తున్నారు. అధిక పనిభారం పడడానికి ఇది ఒక కారణమని వివరిస్తున్నారు. ఇంక్రిమెంట్లు, సెలవులు, బదిలీలు, సీనియారిటీ, డిప్యుటేషన్లు వంటి అంశాల్లో ఏకరూప విధానం అనుసరించాలని కోరుతున్నారు. అయితే, సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిన నాడే సమగ్ర సర్వీస్‌ పాలసీ రూపొందించి ఉంటే, ప్రస్తుతం ఒక్కో అంశంపై ప్రత్యేకంగా ఉత్తర్వులు, మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సరిదిద్దే ప్రయత్నాలు..

గతంలో ఏర్పడిన సమస్యలను దశలవారీగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తోంది. పలు క్యాడర్లకు ప్రమోషన్‌ చానళ్లు కల్పించడం, వేలాది మందికి పదోన్నతులు ఇవ్వడం, ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన అర్హులకు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ వర్తింపచేయడం వంటి చర్యలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమస్యలపై పరిశీలనకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలో క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటుచేసింది. ఇప్పటికే 18 క్యాడర్లలో 14,331 మందికి ప్రమోషన్లు ఇచ్చామని, మరో 800 మందికి కూడా ఇవ్వనున్నట్లు మంత్రి ఇప్పటికే వెల్లడించారు. వార్డు సచివాలయాల్లో నాలుగు క్యాటగిరీలకు స్పష్టమైన ప్రమోషన్‌ మార్గాలను రూపొందించడంతో పాటు 815 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను పునర్యవస్థీకరణ ద్వారా మంజూరుచేశారు. మరో 1,630 పోస్టులను గ్రేడ్‌-2 నుంచి గ్రేడ్‌-1కు అప్‌గ్రేడ్‌ చేసే చర్యలు చేపట్టారు. నోషనల్‌ ఇంక్రిమెంట్లకు సంబంధించి తుది నిర్ణయం, ప్రత్యేక జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ ఏర్పాటు, అన్నీ క్యాడర్లకు సమగ్ర ప్రమోషన్‌ చానళ్లు, పెండింగ్‌ బకాయిల పూర్తి చెల్లింపు, డిఫ్యుటేషన్ల రద్దు, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ప్రాతినిఽథ్యం వంటి అంశాలపై ఇంకా ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఉద్యోగులు నోషనల్‌ ఇంక్రిమెంట్లపై పట్టుబడుతుండగా, ఇప్పట్లో ఇది సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది.


‘స్వర్ణ గ్రామ, వార్డు’ సమస్యలకు పరిష్కారం!

నేడు జీఎస్‌డబ్ల్యూఎస్‌ పదోన్నతులపై భేటీ

స్వర్ణగ్రామ, వార్డు సిబ్బంది సమస్యల పరిష్కార దిశగా మంగళవారం ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఇప్పటి వరకు పదోన్నతి చానల్‌ లేని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల ప్రమోషన్‌ చానల్‌ నిర్ధారణకు వివిధ శాఖలతో స్వర్ణగ్రామ, స్వర్ణవార్డ్‌ సచివాలయ శాఖ సెక్రటరీ కాటమనేని భాస్కర్‌ భేటీ కానున్నారు. వారితో పాటు ఇప్పటికే ప్రమోషన్‌ చానల్‌ ఉన్న వార్డ్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ, వార్డు అమెనిటీస్‌ సెక్రటరీ ప్రమోషన్‌ చానల్‌ మార్పుపైనా చర్చ జరగనుంది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 05:04 AM