కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో..ముగ్గురిని వేటాడిన మృత్యువు!
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:24 AM
వరుస ఘటనల్లో మృత్యువు ముగ్గురిని వేటాడింది. పాముకాటుకు గురైన కుమారుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా, ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ...
కుమారుడికి పాముకాటు..
ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రమాదం
రెండు కార్లు ఢీకొని తండ్రి, కారు డ్రైవర్ మృతి
ఆస్పత్రికి తరలించినా నిలబడని కొడుకు ప్రాణాలు
కార్లలోని పలువురికి గాయాలు..
అనంతలో పెను విషాదం
బొమ్మనహాళ్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): వరుస ఘటనల్లో మృత్యువు ముగ్గురిని వేటాడింది. పాముకాటుకు గురైన కుమారుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా, ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో తండ్రి, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. ఆ తర్వాత పోలీసులు, స్థానికులు కుమారుడిని ఆస్పత్రికి తరలించినా, అతడి ప్రాణాలూ నిలవలేదు. దీంతో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. బొమ్మనహాళ్ మండలంలోని సంజీవరాయునికోట (ఎస్‌ఆర్‌ఎన్ కోట) గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి కుమారుడు పవన్(31) పాము కాటుకు గురయ్యాడు.
దీంతో అతడిని చికిత్స నిమిత్తం కారులో తీసుకుని బళ్లారికి బయలుదేరారు. పవన్ వెంట తండ్రి మల్లికార్జునరెడ్డి, కుటుంబ సభ్యులు పురుషోత్తం రెడ్డి, వరలక్ష్మి ఉన్నారు. వారి కారును రాయదుర్గం-బళ్లారి రోడ్డుపై హీర్ధేహాళ్ క్రాస్, పూలకుర్తి క్రాస్ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. దీంతో మల్లికార్జున రెడ్డి(55), కారు డ్రైవర్ చందు(28) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. రెండు వాహనాల్లో ఉన్న మిగిలినవారు గాయపడ్డారు.
స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను రాయదుర్గం ఆస్పత్రికి తరలించారు. పాముకాటుకు గురైన పవన్‌ను బళ్లారిలోని విమ్స్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. గాయపడ్డవారిలో పురుషోత్తంరెడ్డి, వరలక్ష్మి, మరో కారులోని ఐదుగురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు డి. హీరేహాళ్ ఎస్‌ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు