ఎత్తిపోతల పథకాలకు సౌరవిద్యుత్
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:15 AM
రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు సౌర విద్యుత్ అనుసంధానం చేసి వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
సాగుకు 9 గంటల నిరంతర కరెంటు
సీఎం చంద్రబాబు పచ్చజెండా
నేడు సమగ్ర సమీక్షలో తుది నిర్ణయం
903 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల స్థాపన
240 ఎండబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కూడా.. ఆర్థిక శాఖ ప్రతిపాదన
4,170 ఎకరాల ఇరిగేషన్ భూముల గుర్తింపు
అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు సౌర విద్యుత్ అనుసంధానం చేసి వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆర్థిక, జల వనరుల శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఐడీసీ) ఆధ్వర్యంలోని ఎత్తిపోతల పథకాలకు సౌరవిద్యుత్‌ను అనుసంధానించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ చేసిన ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఈ ప్రతిపాదనపై మంగళవారంనాటి సమీక్షలోనే తుది నిర్ణయం తీసుకోవాలని భావించారు.
అయితే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉండడం, జాతీయ మీడియాకు సీఎం ప్రత్యేక ఇంటర్వూలు ఇవ్వాల్సి రావడంతో.. సమీక్షను బుధవారానికి వాయిదా వేశారు. రాష్ట్రంలో ఏపీఎస్ఐడీసీ అధీనంలోని 1023 ఎత్తిపోతల పథకాల్లో.. 166 సంపూర్ణంగా పనిచేస్తున్నాయి. 503 పాక్షికంగా పని చేస్తున్నాయి. మరో 120 పూర్తిగా పని చేయడం లేదు. వీటికి మరమ్మతులు చేసి.. పంపులు, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు, ప్రెజర్ పైపులు, ఇతర సివిల్ నిర్మాణాలు చేపట్టాలని.. వీటి పునరుద్ధరణకు రూ.632 కోట్ల వ్యయమవుతుందని.. పదేళ్లపాటు వీటి నిర్వహణకు రూ.2,314 కోట్లు.. మొత్తంగా 2,946 కోట్లు ఖర్చవుతుందని ఆర్థిక శాఖ తెలిపింది. 903.1 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లు, 240 ఎండబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(బెస్) ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. వీటితో ఏటా 1551 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. అందులో 517 ఎంయూలను ఎత్తిపోతలకు వినియోగించి.. మిగతా 1034 మిలియన్ యూనిట్లను గ్రిడ్ కు విక్రయించాలని ప్రతిపాదించింది.
ఈ పథకానికి రూ.5072 కోట్ల మూలధన వ్యయం అవసరమని అంచనా వేసింది. ఇందులో కేంద్ర వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద రూ.1314 కోట్ల గ్రాంటు వస్తుందని, ప్రైవేటు భాగస్వామ్య పెట్టుబడి కింద రూ.832 కోట్లు, 9 శాతం రాయితీతో కూడిన రుణం రూ.1942 కోట్లు, రాష్ట్ర వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద రూ.984 కోట్లు వ్యయం చేయవచ్చని తెలిపింది. వ్యవసాయానికి సాగునీరందించి సెస్ వసూళ్ల ద్వారా రూ.1560 కోట్లు, పారిశ్రామిక నీటి కేటాయింపుల ద్వారా రూ.950 కోట్లు రాబడి వస్తుందని.. అలాగే ఎత్తిపోతలకు వినియోగించే విద్యుత్ పోను గ్రిడ్‌కు విక్రయించే కరెంటు వల్ల రూ.1364 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్థిక శాఖ తన నివేదికలో పేర్కొంది.
ఈ విధానం వల్ల మొదటి పదేళ్లలో స్థూల ఆదాయం రూ.14,926 కోట్లు వస్తుందని అంచనావేసింది. ఎత్తిపోతల పథకాలకు సోలార్ ప్లాంట్ల స్థాపనకు జల వనరుల శాఖ ల్యాండ్‌బ్యాంక్, ఏపీఎస్ఐడీసీ ప్రాంగణాల్లో 4,170 ఎకరాల భూములున్నట్లు గుర్తించామని తెలిపింది. ఇలా ఎత్తిపోతల పథకాలకు సౌర విద్యుత్‌ను అనుసంధానిస్తే అన్నదాతలకు ఉచితంగా, 9 గంటలు నిరంతరాయంగా కరెంటు ఇవ్వొచ్చని నివేదించింది.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!