పంచాయతీ క్యాడర్ ప్రక్షాళన!
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:35 AM
పంచాయతీ కార్యదర్శుల కేడర్ నిర్వహణను మరింత సమగ్రంగా చేపట్టేందుకు పంచాయతీరాజ్‌శాఖ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పరిధిలో ఉన్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల కేడర్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించింది.
పీఆర్ అండ్ గ్రామీణంలోకి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు
గ్రామ సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీ
రూర్బన్, గ్రేడ్-1 పంచాయతీల్లో ఇద్దరు చొప్పున
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతిపాదన
పీఆర్ అండ్ గ్రామీణంలోకి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శుల కేడర్ నిర్వహణను మరింత సమగ్రంగా చేపట్టేందుకు పంచాయతీరాజ్‌శాఖ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పరిధిలో ఉన్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల కేడర్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించింది. కేడర్ నియంత్రణాధికారాన్ని మార్చడంతోపాటు ప్రస్తుతం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు ఉపయోగిస్తున్న లాగిన్ క్రెడెన్షియల్‌ను కూడా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు బదిలీ చేయాలని ఆ శాఖను కోరింది. ఈ మార్పు పూర్తిగా పరిపాలనాపరమైనదేనని, దీనివల్ల గ్రామ సచివాలయాల పనితీరుకు, ప్రజలకు అందుతున్న సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. పంచాయతీ కార్యదర్శుల కేడర్‌ను హేతుబద్ధీకరించే ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్న 5 కేటగిరీలను 3 కేటగిరీలుగా పునర్యవస్థీకరించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రస్తుతమున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల కేటగిరీ కొనసాగదు. ఈ నేపథ్యంలో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులను స్వర్ణగ్రామ, వార్డు శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోకి తీసుకురానున్నారు.
గ్రామ సచివాలయానికి ఒక కార్యదర్శి
పునర్యవస్థీకరించిన కేడర్ నిర్మాణంలో భాగంగా ప్రతి గ్రామ సచివాలయానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉంటారు. దీనివల్ల గ్రామ స్థాయిలో పరిపాలనా, పౌరసేవల నిర్వహణకు బాధ్యతా వ్యవస్థ ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అన్ని గ్రామ పంచాయతీలకు ఒకే విధమైన సిబ్బంది అవసరం ఉండదనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. రూర్బన్ గ్రామ పంచాయతీలు, గ్రేడ్-1 గ్రామ పంచాయతీల్లో పరిపాలనా అవసరాలను బట్టి ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను నియమించే అవకాశముంది.
ఇప్పటికే 8,823 మంది విధుల్లో...
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పరిపాలనా నియంత్రణలో ప్రస్తుతం 8,823 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పటికే వివిధ పౌర సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పంచాయతీరాజ్‌శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులందరికీ ఒకే కేడర్ నియంత్రణ వ్యవస్థ ఉండటం పాలనా పరంగా అనుకూలంగా ఉంటుందని పంచాయతీరాజ్‌శాఖ భావిస్తోంది. ప్రస్తుత గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల కేడర్ కంట్రోలింగ్ అథారిటీని స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు మార్చడంతో పాటు వారికి సంబంధించిన లాగిన్ క్రెడెన్షియల్స్‌ను కూడా బదిలీ చేయాలని ప్రతిపాదించారు. ఈ లాగిన్ వివరాల బదిలీని ఉద్యోగుల విధుల్లో మార్పుగా పరిగణించాల్సిన అవసరం లేదని పంచాయతీరాజ్‌శాఖ స్పష్టం చేసింది. ఇది కేవలం ఏకీకృత కేడర్ నిర్వహణ కోసం చేపడుతున్న చర్య మాత్రమేనని పేర్కొంది. దీనివల్ల గ్రామ సచివాలయాల రోజువారీ కార్యకలాపాలు లేదా ప్రజలకు అందించే పౌరసేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.
సేవలకు అంతరాయం ఉండదు
కేడర్ నియంత్రణాధికారంలో మార్పు వచ్చినప్పటికీ గ్రామ సచివాలయాల వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలోని వేలాది మంది పంచాయతీ కార్యదర్శులు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నందున, గ్రేడ్-5 కార్యదర్శుల కేడర్‌ను కూడా అదే శాఖ పరిధిలోకి తీసుకురావడం ద్వారా బాధ్యతల్లో ఏకరూపత ఏర్పడుతుందని పేర్కొంది. కేడర్ పునర్యవస్థీకరణ అమల్లో భాగంగా అవసరమైన సాంకేతిక, పరిపాలనా మార్పులను చేపట్టడంతో పాటు సంబంధిత ఉద్యోగుల లాగిన్ వివరాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు బదిలీ చేయాలని ఆర్థికశాఖ సూచించినట్లు ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..