రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించాలి
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:50 AM
రౌడీయిజం చేసి ఎన్నికలు అడ్డుకోవాలనుకునే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని..
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి: టీడీపీ
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రౌడీయిజం చేసి ఎన్నికలు అడ్డుకోవాలనుకునే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత పి. అశోక్బాబు సూచించారు. మంగళవారం అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశాయి. గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని లేదంటే కేంద్ర నిధులు కోల్పోయే అవకాశముందని అశోక్బాబు పేర్కొన్నారు. జనసేన నేత శివశంకర్ మాట్లాడుతూ... స్థానిక సంస్థలకు ఎన్నికలు 2021లో నిర్వహించినట్లుగా కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో చేపట్టాలన్నారు. దసరా ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీజేపీ నేత నాగోతు రమేష్ నాయుడు కోరారు. వైసీపీ నేత కన్నబాబు మాట్లాడుతూ... ఎన్నికల్లో పోటీ చేసేవారికి మాన్యువల్గా కుల ధ్రువీకరణ పత్రాలు, నోడ్యూస్ సర్టిఫికేట్ల జారీ చేయాలన్నారు.
కట్టుదిట్టంగా స్థానిక ఎన్నికలు: పునేఠ
‘రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. నామినేషన్ల సమయంలో అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా, పోలింగ్ స్టేషన్లల్లో సమస్యలు తలెత్తకుండా అన్నీ సిద్ధం చేశాం’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ వెల్లడించారు. గుర్తింపుపొందిన 20 పార్టీలను సమావేశానికి ఆహ్వానించగా 19 పార్టీల ప్రతినిధులు పాల్గొని, ఏడు ప్రధాన సలహాలు ఇచ్చారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత