ముగిసిన నామినేషన్ల పర్వం
ABN , Publish Date - Oct 19 , 2026 | 04:56 AM
రాష్ట్రంలో మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ఆదివారం ముగిసింది.
అభ్యర్థుల లెక్క
13 కార్పొరేషన్లలో మేయర్ పదవికి
320 మంది అభ్యర్థుల పోటీ
87 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల
చైర్‌పర్సన్ పీఠానికి 1038 మంది
చివరి రోజు అభ్యర్థుల జోరు
కొన్ని స్థానాల్లో ప్రత్యర్థులుగా సొంత కుటుంబాల వ్యక్తులు
నర్సీపట్నంలో స్పీకర్ సతీమణి, ఆమె తోడికోడలు మధ్య ఫైట్
నెల్లూరులో రాత్రి 10 తర్వాతా దాఖలు
వైసీపీకి కొన్ని చోట్ల అభ్యర్థులు కరువు
(ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలో మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ఆదివారం ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పలు స్థానాల్లో సొంత కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా బరిలో నిలవడం ఆసక్తిగా మారింది. మొత్తం 13 కార్పొరేషన్లలో మేయర్ పదవి కోసం 320 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 87 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల చైర్‌పర్సన్ పీఠం కోసం బరిలో 1038 మంది నిలిచారు. ఎన్నికలు జరుగుతున్న పదమూడు కార్పొరేషన్లలో 3020 వార్డులు ఉండగా 8198 మంది అభ్యర్థులు కార్పొరేటర్ పదవి కోసం పోటీలోకి దిగారు. 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 922 వార్డులు ఉన్నాయి. వాటిలో వివిధ రాజకీయ పక్షాల నుంచి, స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ పడుతున్న వారి సంఖ్య 16,253 మంది. అయితే ఈ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ 19తో ముగుస్తుంది. ఆ తరువాత 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రానికి తుది పోరులో నిలిచే వారి సంఖ్య తేలనుంది.
అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం మునిసిపల్ చైర్‌పర్సన్ పదవికి ఐదుగురు నామినేషన్లు వేశారు. టీడీపీ తరపున స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, వైసీపీ తరపున ఆమె తోటికోడలు చింతకాయల అనిత నామినేషన్లు వేశారు.
కడప జిల్లాలో మొత్తం 345 డివిజన్లు, వార్డులకు 1,125 నామినేషన్లు దాఖలు కాగా, మేయరు, చైౖర్‌పర్సన్లకు 83 నామినేషన్లు దాఖలయ్యాయి. పులివెందులలో మొత్తం 40 వార్డులు ఉన్నాయి. వైసీపీ నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థిగా జగన్ బాబాయి వైఎస్ మనోహర్‌రెడ్డి భార్య వైఎస్ ప్రమీల నామినేషన్ దాఖలు చేశారు. ఇక 40 వార్డులకు గాను వైసీపీ మొత్తం 30 నామినేషన్లు దాఖలు చేసింది. టీడీపీ నుంచి 69 నామినేషన్లు దాఖలయ్యాయి.
అనంతపురం మేయర్ స్థానానికి బీజేపీ అభ్యర్థి కోట్ల అజేశ్ యాదవ్, వైసీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా రమేశ్‌గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా, ఐదు వార్డులకు వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేయలేదు. 37వ వార్డుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రమే నామినేషన్ వేశారు.
నెల్లూరులో అర్ధరాత్రి వరకు నామినేషన్లు
నెల్లూరు నగర కార్పొరేషన్, బుచ్చి, ఆత్మకూరు మున్సిపాలిటీలకు ఆదివారం చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. నెల్లూరు మేయరు పదవికి 35 నామినేషన్లు, 72 వార్డులకు 663 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నెల్లూరు నగర కార్పొరేషన్‌లో అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. బుచ్చి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ పదవికి 9 మంది, 28 వార్డులకు 130 మంది, ఆత్మకూరు చైర్‌పర్సన్ స్థానానికి 10 మంది, 28 వార్డులకు 148 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల 'స్వీకరణకు గడువు ముగియడంతో ఆలోపు క్యూలో ఉన్న వారందరికీ ఎన్నికల అధికారులు టోకన్లు జారీ చేశారు. దీంతో రాత్రి 10.30 గంటల వరకు అధికారులు దరఖాస్తులను స్వీకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి