Share News

పురాధీశులెవరో?

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:25 AM

రాష్ట్రంలో 92 పట్టణ స్థానిక సంస్థల అధిపతులెవరో మంగళవారం తేలిపోనుంది. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అన్ని ఏర్పాట్లూ చేసింది. మొత్తం 138 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది.

పురాధీశులెవరో?

  • మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు నేడే

  • 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లో 138 లెక్కింపు కేంద్రాలు

  • ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

  • ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు

  • తర్వాత బ్యాలెట్‌ బ్యాక్సుల్లోని ఓట్లు

  • నగర పంచాయతీలు, చిన్న పురపాలికల్లో మధ్యాహ్నానికి ఫలితాల వెల్లడి

  • కార్పొరేషన్లు, పెద్ద మున్సిపాలిటీల్లో రాత్రికే!

  • మున్సిపోల్స్‌.. తుది పోలింగ్‌ 62.16 శాతం

  • 13 కేంద్రాల్లో రీపోలింగ్‌ ప్రశాంతం

అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 92 పట్టణ స్థానిక సంస్థల అధిపతులెవరో మంగళవారం తేలిపోనుంది. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అన్ని ఏర్పాట్లూ చేసింది. మొత్తం 138 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుంది. మొదట పోస్టల్‌

బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత కౌంటింగ్‌ అధికారులు, పార్టీల తరఫు కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులను తెరుస్తారు. మేయర్‌/చైర్‌పర్సన్‌, డివిజన్‌/వార్డుల బ్యాలెట్లను వేరుచేస్తారు. రౌండ్లవారీగా వాటిని వేర్వేరుగా లెక్కించి.. తుది ఫలితాలు ప్రకటిస్తారు. కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్య ఎక్కువగా ఉండడం.. కొన్ని పురపాలక సంఘాల్లో పోలింగ్‌ కేంద్రాలు అధికంగా ఉండడంతో ఓట్ల లెక్కింపునకు ఒక్కో చోట ఒక్కో సమయం పడుతుంది. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేసరికి రాత్రి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నగర పంచాయతీలు, చిన్న మున్సిపాలిటీల్లో మధ్యాహ్నానికే ఫలితాలు వెల్లడవుతాయని అంటున్నారు.

రెండు దశల్లో లెక్కింపు..

మేయర్‌/చైర్‌పర్సన్‌, డివిజన్‌/వార్డుల ఓట్ల లెక్కింపును రెండు దశల్లో చేపడతారు. మొదటి దశలో అన్ని పోలింగ్‌ కేంద్రాల బ్యాలెట్‌ బాక్సుల నుంచీ బ్యాలెట్‌ పేపర్లను బయటకు తీసి వేరుచేస్తారు. మేయర్‌/చైర్‌పర్సన్‌కు గులాబీ రంగు బ్యాలెట్లు, వార్డు సభ్యులకు తెల్ల రంగు బ్యాలెట్లు ఉన్నాయి. వీటిని వేరుచేసి 25 చొప్పున కట్టలుగా తయారుచేస్తారు. రెండో దశలో ప్రతి లెక్కింపు టేబుల్‌కు 25 బ్యాలెట్ల చొప్పున 40 కట్టలు అంటే మొత్తం 1000 బ్యాలెట్‌ పేపర్లను పంపిణీ చేస్తారు. వాటిని ఒక్కో కట్టగా పరిశీలించి చెల్లుబాటయ్యే ఓట్లను అభ్యర్థుల వారీగా వేరు చేసి లెక్కిస్తారు.


లెక్కించిన బ్యాలెట్‌ పేపర్లను అభ్యర్థుల వారీగా 50 చొప్పున కట్టలుగా కడతారు. 25 కంటే తక్కువగా ఉన్న బ్యాలెట్లను విడిగా కట్టి వాటి సంఖ్యను స్లిప్‌పై నమోదు చేస్తారు. మేయర్‌/చైర్‌పర్సన్‌, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపును ఏకకాలంలో చేపట్టాలా.. లేక వరుస క్రమంలో లెక్కించాలా అనే అంశంపై రిటర్నింగ్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్లతో కౌంటింగ్‌ ప్రారంభిస్తారు. 9 గంటల నుంచి బ్యాలెట్‌ పత్రాలు పరిశీలిస్తారు. అభ్యర్థుల వారీగా బ్యాలెట్లు వేరుచేసి.. బండిల్స్‌ కట్టి లెక్కిస్తారు. మధ్యాహ్నానికి వార్డుల వారీగా ఫలితాల వెల్లడి మొదలవుతుంది.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మేయర్‌, చైర్‌పర్సన్‌ బ్యాలెట్లు, మిగిలిన స్థానాల ఓట్లు లెక్కిస్తారు. రాత్రి 8 గంటల్లోపు మొత్తం కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసు బలగాలను మోహరించారు.

లెక్కింపు పూర్తయ్యాక ప్రతి అభ్యర్థికీ వచ్చిన ఓట్లతోపాటు నోటా ఓట్ల వివరాలను ఫలితాల పట్టికలో నమోదు చేసి.. రిటర్నింగ్‌ అధికారి సంతకం చేస్తారు. అభ్యర్థి లేదా ఆయన ఏజెంట్‌ కోరితే ఫలితాల పట్టిక కాపీ అందించాలి.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో ఒకే సంఖ్యలో టేబుళ్లు ఉండవు. వార్డుల సంఖ్య, పోలింగ్‌ కేంద్రాలు, కౌంటింగ్‌ హాల్‌ సామర్థ్యం ఆధారంగా ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు అతిపెద్దదైన గుంటూరు కార్పొరేషన్‌లో 50 హాళ్లలో 468 టేబుళ్లను ఏర్పాటుచేశారు. 2160 మంది కౌంటింగ్‌ సిబ్బందిని నియమించారు.


ప్రతి అభ్యర్థీ లెక్కింపు టేబుళ్ల సంఖ్యకు సమానంగా ఏజెంట్లను, రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద పరిశీలన కోసం మరో ఏజెంట్‌ను నియమించుకోవచ్చు. వారికి బ్యాడ్జీలిస్తారు. గుర్తింపు కార్డులు ఉన్నవారికే లెక్కింపు హాలులోకి ప్రవేశం ఉంటుంది.స్ట్రాంగ్‌రూమ్‌ల్లో, కౌంటింగ్‌ హాళ్లలో 1372 సీసీ కెమేరాలు అమర్చారు.

సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల నిషేధం..

లెక్కింపు కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్లు, ఐప్యాడ్‌లు, ల్యాప్‌టా్‌పలు.. ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేసే ఏ ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలనూ అనుమతించరు. ఎన్నికల పరిశీలకులకు మాత్రం మినహాయింపు ఉంటుంది.

లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరిస్తారు. స్ట్రాంగ్‌రూం తెరవడం నుంచి బ్యాలెట్‌ బాక్సుల తరలింపు, లెక్కింపు హాళ్ల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు, భద్రతా ఏర్పాట్లు అభ్యర్థులు, ఏజెంట్లు ఫలితాల ప్రకటన, ఎన్నికల ధ్రువీకరణ పత్రాల అందజేత, ఎన్నికల పత్రాల సీలింగ్‌ వంటి అన్ని ముఖ్యమైన దశలనూ వీడియో తీస్తారు. దానిని జిల్లా ఎన్నికల అథారిటీ అధీనంలో ఉంచుతారు.

రీకౌంటింగ్‌కు 15 నిమిషాల గడువు

ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ప్రతి అభ్యర్థికీ వచ్చిన ఓట్ల సంఖ్యను ఫలితాల పట్టికలో నమోదు చేసి ప్రకటించాలి. అనంతరం ఒకట్రెండు నిమిషాలు వేచిచూస్తారు. ఈ సమయంలో అభ్యర్థి లేదా ఆయన ఎన్నికల ఏజెంట్‌, కౌంటింగ్‌ ఏజెంట్‌ రీకౌంటింగ్‌ కోరవచ్చు. రీకౌంటింగ్‌ కోసం లిఖితపూర్వక దరఖాస్తు సమర్పించేందుకు 15 నిమిషాలు గడువిస్తారు. రీకౌంటింగ్‌ కోరిన కారణాలను పరిశీలించి అనుమతించాలా, తిరస్కరించాలా అనేది రిటర్నింగ్‌ అధికారి నిర్ణయిస్తారు.

ఏ నిర్ణయమైనా కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేస్తారు. రీకౌంటింగ్‌కు అనుమతిస్తే కేవలం కట్టలను మళ్లీ లెక్కించడం మాత్రమే కాకుండా సంబంధిత ప్రతి బ్యాలెట్‌నూ తిరిగి పరిశీలించి ఓటు చెల్లుబాటవుతుందా, ఏ అభ్యర్థికి పడిందో నిర్ధారిస్తారు. అవసరమైతే పోస్టల్‌ బ్యాలెట్లను కూడా తిరిగి పరిశీలిస్తారు. ఒకసారి ఫలితాల పట్టికపై రిటర్నింగ్‌ అధికారి సంతకం చేసిన తర్వాత.. రీకౌంటింగ్‌ కోరే హక్కు అభ్యర్థికి ఉండదు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 05:25 AM