Share News

నేడే పరిషత్‌ నోటిఫికేషన్‌

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:34 AM

రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం నగారా మోగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా 659 మండలాల్లో జెడ్పీటీసీ, 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నేడు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

నేడే పరిషత్‌ నోటిఫికేషన్‌
ELECTION

  • నేడే పరిషత్‌ నోటిఫికేషన్‌

  • 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ

  • 24న పరిశీలన... 27న ఉపసంహరణకు అవకాశం

  • నవంబరు 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌

  • 5న లెక్కింపు, ఫలితాల ప్రకటన

అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం నగారా మోగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా 659 మండలాల్లో జెడ్పీటీసీ, 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నేడు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. 21న ఆయా మండలాల రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల నోటీసు ఇస్తారు. ఆ రోజు నుంచి 23 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్లను పరిశీలిస్తారు. 25, 26 తేదీల్లో నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఉపసంహరణకు 27న అవకాశమిచ్చి, అదే రోజు తుది జాబితా ప్రకటిస్తారు. నవంబరు 3న ఎన్నికలు... రీపోలింగ్‌ అవసరమైన చోట నవంబరు 4న నిర్వహిస్తారు. నవంబరు 5న ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

నామినేషన్ల కేంద్రాల్లో సీసీ కెమెరాలు

రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద, బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. ఇప్పటికే వెండర్‌ను ఎంపిక చేశారు. 20లోపు కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇప్పటికే పోలింగ్‌ సిబ్బంది శిక్షణ కూడా పూర్తయింది.


ముగిసిన మున్సిపల్‌ నామినేషన్లు గడువు...

ఈ నెల 14న పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా, 16 నుంచి 18 దాకా నామినేషన్లు స్వీకరించారు. 19న నామినేషన్ల పరిశీలన పూర్తి చేస్తారు. 21న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిచ్చా... అదే రోజు అభ్యర్థుల తుదిజాబితా ప్రకటిస్తారు. 28న పోలింగ్‌, అవసరమైన చోట రీపోలింగ్‌ 29న నిర్వహిస్తారు. 30న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. నవంబరు 5, 6 తేదీల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

Updated Date - Oct 19 , 2026 | 05:35 AM