Share News

వాళ్ల చిట్టా నా దగ్గరుంది!

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:35 AM

స్థానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల టీడీపీ నేతల నిర్లక్ష్యం వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యానించారు

వాళ్ల చిట్టా నా దగ్గరుంది!

  • టీడీపీ నేతల నిర్లక్ష్యంతోనే అక్కడ ఓటమి: లోకేశ్‌

  • పొత్తు ధర్మం పాటించని వారిపై కఠిన చర్యలు

  • ఏ స్థాయిలో ఉన్నా బాధ్యులపై చర్యలు

  • మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్‌ భేటీలో లోకేశ్‌ స్పష్టీకరణ

అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల టీడీపీ నేతల నిర్లక్ష్యం వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ఏ నాయకుడు ఎలా పనిచేశారో వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని, నిర్లక్ష్యంగా ఉన్నవారి విషయంలో కఠినంగా ఉంటామని తేల్చిచెప్పారు. క్యాబినెట్‌ సమావేశానికి ముందు.. మంగళవారం ఉదయం ఉండవల్లి నివాసంలో మంత్రులతో బ్రేక్‌ఫాస్ట్‌ భేటీ నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పనితీరుపైనే ప్రధానంగా చర్చించారు. అనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ అభ్యర్థి ఓటమికి కారణాలేమిటో ప్రత్యేక నివేదిక తెప్పించుకుంటున్నామని చెప్పారు.

స్థానిక నేతల పనితీరుపరంగా లోపాలేమిటో పరిశీలించి, పొత్తు ధర్మం పాటించని వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో కూటమి పనితీరు ఆశాజనకంగా ఉన్నా.. పరిషత్‌ ఎన్నికల్లో మాత్రం చాలా లోటుపాట్లు కనిపించాయని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సుమారు 76 జడ్పీటీసీలు, 1711 ఎంపీటీసీల్లో గెలవడానికి ప్రజల్లో వారిపట్ల ఉన్న సానుకూలత కారణం కాదని.. కూటమిలో సమన్వయ లోపాలే ప్రధాన కారణమని స్పష్టం చేసినట్లు తెలిసింది. అన్నిచోట్ల నుంచీ సమగ్ర నివేదికలు తెప్పించుకుని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాయకులు ఏ స్థాయిలోని వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ ఏయే నియోజకవర్గాల్లో ఎక్కువగా గెలిచిందో పార్టీపరంగా నివేదికలు తెప్పిస్తున్నామని, ఆ స్థానాల్లో ఏ కారణంతో వైసీపీ అభ్యర్థులు గెలిచారో లోతైన పరిశీలన చేస్తున్నామని లోకేశ్‌ తెలిపారు.


‘కదిరిలో 6 జడ్పీసీలకు 4 స్థానాలు, పుట్టపర్తిలో 6 జడ్పీటీసీలకు 3చోట్ల వైసీపీ గెలిచింది. ఇలా ప్రతి నియోజకవర్గం నుంచి వివరాలు సేకరించి కారణాలు విశ్లేషిస్తున్నాం. కొన్నిచోట్ల పార్టీలతో పనిలేకుండా అభ్యర్థిపై క్యాడర్‌లో అసంతృప్తి కారణంగా ఓడిపోయాం. దీనిని పార్టీ వైఫల్యంగా భావిస్తాం. దాదాపు అన్నిచోట్ల క్యాడర్‌ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాం. కొన్నిచోట్ల పొత్తుల్లో భాగంగా వాటిని పక్కన పెట్టాల్సి వచ్చింది. అక్కడ ఓడిపోయాం’ అని ఆయన అన్నట్లు సమాచారం. చంద్రగిరిలో జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు గెలుచుకోవడం.. ఏజెన్సీ నియోజకవర్గాల్లో వైసీపీకి ఎక్కువ స్థానాలు ఎందుకు వచ్చాయన్న దానిపైనా చర్చజరిగినట్లు తెలిసింది. అనకాపల్లి, ఏలూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ భారీగా ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుందని.. వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని లోకేశ్‌ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 01:37 AM