ఏపీని కార్పొరేట్ హోమ్‌గా మార్చుకోండి
ABN , Publish Date - Nov 13 , 2026 | 03:48 AM
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ముందు పెట్టుబడులు పెట్టండి. ఆ తరువాత కంపెనీ ప్రధాన కార్యాలయం ఇక్కడకు తరలించండి. మీకు పూర్తి అండగా మేం ఉంటాం.’’ అని పెట్టుబడిదారులకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.
స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ మా లక్ష్యం..
పెట్టుబడిదారుల సదస్సులో లోకేశ్
విశాఖపట్నం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ముందు పెట్టుబడులు పెట్టండి. ఆ తరువాత కంపెనీ ప్రధాన కార్యాలయం ఇక్కడకు తరలించండి. మీకు పూర్తి అండగా మేం ఉంటాం.’’ అని పెట్టుబడిదారులకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్రాన్ని కార్పొరేట్ హోమ్‌గా మార్చుకోవాలని కోరారు. విశాఖపట్నంలో గురువారం ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారులకు పూర్తి భరోసా ఇచ్చారు.
‘‘ఏపీలో అపారమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయి. ఏ రంగం ఎంచుకున్నా ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుంది. వ్యాపారానికి నమ్మకం (ట్రస్ట్) ప్రధానం. అది కూటమి ప్రభుత్వం చేతల్లో చూపిస్తుంది. ఒకసారి ప్రాజెక్టు గ్రౌండింగ్ జరిగితే దానిని సొంత ప్రాజెక్టులా ప్రభుత్వం చూసుకుంటుంది.’’అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
మా బలాలు ఇవీ..
‘‘రాష్ట్రంలో వేయి కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం, వంద మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసే విశాఖ పోర్టు ఉన్నాయి. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడల్లో గ్రీన్‌పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. ‘కొత్తగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాం. అక్కడ భారీ బోయింగ్ విమానాలు వస్తాయి. ఉత్పత్తులను పోర్టులు, ఎయిర్‌పోర్టుల ద్వారా ఎక్కిడికైనా రవాణా చేసుకునే వీలుంది. భారత్‌లో అమ్ముడుపోతున్న ఎయిర్ కండిషనర్లలో (ఏసీలు) 60 శాతం ఏపీలోని శ్రీసిటీలో తయారవుతున్నాయి.
సముద్ర ఆహార ఉత్పత్తుల్లో 80 శాతం రొయ్యలు ఇక్కడ నుంచే ఎగుమతి అవుతున్నాయి. దేశంలో 50 శాతానికి పైగా కోకో ఇక్కడే పండుతోంది. ఎండుమిర్చిలో 40 శాతం గుంటూరు నుంచే సరఫరా అవుతోంది. రైస్ బౌలే కాకుండా ఇప్పుడు ఏపీ ఫ్రూట్ బౌల్‌గా కూడా అభివృద్ధి సాధించింది. గుడ్ల ఉత్పత్తిలో ఏపీనే నంబర్‌వన్. మరోవైపు విశాఖపట్నం ఐటీ సిటీగా మారుతోంది. కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి పెద్ద సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ ఏడాది అక్టోబరు వరకు రూ.22.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటిలో 73 శాతం, అంటే 12.7 లక్షల మందికి ఉపాధి కల్పించే రూ.17.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. వాటిలో 51 శాతం గ్రౌండింగ్ అయ్యాయి. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం మారిందని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.’’ అని లోకేశ్ వివరించారు.
స్పీడ్.. స్టెబిలిటీ... సర్వీసెస్
కూటమి ప్రభుత్వం ‘3 ఎస్’ విధానం అనుసరిస్తోందని మంత్రి లోకేశ్ వివరించారు. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీసులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ‘‘గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌గా మార్చి వేగవంతం చేశాం. ప్రభుత్వం పాలసీలను ఎప్పటికప్పుడు మార్చకుండా స్థిరంగా ఉంచి, పారిశ్రామికవేత్తలకు విశ్వాసం కలిగిస్తున్నాం. ప్రాజెక్టు ప్రారంభించిన తరువాత ఎటువంటి సమస్య వచ్చినా ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాం. ముందు పరిశ్రమను ప్రారంభించి, ఆ తరువాత సంస్థ మొత్తం ఇక్కడికి తీసుకురండి. అందుకు అవసరమైన ప్రణాళికలతో ఇక్కడి నుంచి వెళ్లండి.’’ అని మంత్రి లోకేశ్ కోరారు.
అరకు కాఫీని సేకరించండి.. ఎస్‌ఎల్‌ఎన్ కాఫీ చైర్మన్‌తో లోకేశ్
మిడిల్ ఈస్ట్, యూరప్, ఆగ్నేయాసియా, రష్యా తదితర కీలక అంతర్జాతీయ మార్కెట్ల కోసం ప్రీమియం అరకు కాఫీని సేకరించాలని ఎస్‌ఎల్‌ఎన్ కాఫీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శతప్పన్‌ను సీఐఐ సదస్సులో మంత్రి లోకేశ్ కోరారు. అరకు కాఫీ ప్రాసెసింగ్, మార్కెటింగ్, పంపిణీ కోసం ఏపీ గిరిజన కార్పొరేషన్‌తో కలిసి పనిచేయాలన్నారు. జాతీయ రహదారుల వెంబడి, ప్రధాన పట్టణ కేంద్రాల్లో ఎస్‌ఎల్‌ఎన్ కాఫీ అనుబంధ సంస్థ లెవిస్టా కేఫ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు