డిజిటల్ విధానంలో ఖనిజాల మ్యాపింగ్
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:32 AM
‘సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠంగా వినియోగిస్తూ, పర్యావరణ పరిరక్షణతో కూడిన మైనింగ్ రంగాన్ని అభివృద్ధి చేసి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే ‘మెరిట్’ లక్ష్యం. రాష్ట్ర మైనింగ్ రంగాన్ని దేశంలోనే ‘ది బెస్ట్’గా నిలిపేలా అధికారులు పని చేయాలి’
పర్యావరణహితంగా ఖనిజాన్వేషణపై దృష్టి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వనరుల వృద్ధి
‘మెరిట్’ గవర్నింగ్ బాడీ భేటీలో మంత్రి రవీంద్ర
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ‘సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠంగా వినియోగిస్తూ, పర్యావరణ పరిరక్షణతో కూడిన మైనింగ్ రంగాన్ని అభివృద్ధి చేసి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే ‘మెరిట్’ లక్ష్యం. రాష్ట్ర మైనింగ్ రంగాన్ని దేశంలోనే ‘ది బెస్ట్’గా నిలిపేలా అధికారులు పని చేయాలి’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్(మెరిట్) గవర్నింగ్ బాడీ సమావేశంలో మైనింగ్ అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, కొత్త ఖనిజ నిల్వలను గుర్తించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉండే ఖనిజాలను డిజిటల్ విధానంలో మ్యాపింగ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మరో మూడేళ్లలో మంగంపేట గనులు ఖాళీ
సంస్థ చేపట్టిన వివిధ కార్యక్రమాలను, కార్యాచరణను అధికారులు వివరించారు. ‘‘మైనర్ మినరల్ లీజుదారుల నుంచి వచ్చే సీనరేజి రుసుములో 2 శాతం విరాళంగా, కేంద్ర ఎన్‌ఎంఈటీ గ్రాంట్ల ద్వారా ఇప్పటి వరకు ‘మెరిట్’కు రూ.177.05 కోట్లు సమకూరాయి. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వమే స్వయంగా పర్యావరణ, మైనింగ్ ప్లాన్ అనుమతులను తీసుకుని, వేలం వేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. జయంతిపురం, దేవుడి, గుండ్లకుంట, అలగుమల్లిపాడు, నడికుడి, రామాపురం, పిల్లుట్ల, పిడుగురాళ్ల వంటి 9 బ్లాకులకు అనుమతుల ప్రక్రియ వేగవంతం చేశాం. ఈ-వేలం 2027 జనవరి 1 నుంచి 22 మధ్య పూర్తి కానున్నది. దేశంలోనే 95 శాతం బైరటీస్ ఖనిజాన్ని ఉత్పత్తి చేసే కడప జిల్లా మంగంపేట గనిలో ప్రస్తుత నిల్వలు మరో 3-4 ఏళ్లకు మాత్రమే సరిపోతాయి’’ అని అధికారులు పేర్కొన్నారు.
గని ఆయుష్షును పెంచేందుకు ‘మెస్సెర్స్ అటామియోనిక్స్ ఇండియా’ సంస్థతో కలసి రూ.9.90 లక్షలతో ఆధునిక ‘క్వాంటమ్ గ్రావిమీటర్’ ద్వారా భూగర్భంలో అదనపు ఖనిజ నిల్వలను గుర్తించే ప్రయోగాత్మక సర్వేకు సమావేశంలో ఆమోదం తెలిపారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 339 మినరల్ ప్రొటెన్షియల్ ఏరియాలను గుర్తించాం. అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో క్రిటికల్ మినరల్స్ అన్వేషణకు ఏఐ/ఎంఎల్ మ్యాపింగ్ పూర్తయింది. ఐఐటీ ధన్‌బాద్(టాక్స్‌మిన్)తో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ హైదరాబాద్‌తో కడప బేసిన్‌లో లిథియం, గాలియం వంటి వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణకు ఎంవోయూలు కుదిరాయి. ఐరన్ ఓర్, లైమ్‌స్టోన్, క్వార్జ్ తదితర ఖనిజాల అన్వేషణకు కేంద్ర గనుల శాఖ ఆమోదం పొందిన 18 ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీలను ఎంప్యానెల్ చేశాం. వాటికి వేలంలో రూ.7.01 కోట్ల విలువైన 6 ప్రధాన అన్వేషణ పనులు అప్పగించాం’’ అని అధికారులు చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు