‘రుషికొండ’ ఓ క్రిమినల్ వేస్ట్
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:13 AM
‘‘విశాఖ తీరంలో రుషికొండను తొలిచి జగన్ నిర్మించిన ప్యాలెస్‌ని క్రిమినల్ వేస్ట్ అనొచ్చు.’’ అని మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మాట్లాడుతూ...
అన్ని నిబంధనలూ ఉల్లంఘించిజగన్ సొంతానికి నిర్మించారు
బాత్‌టబ్ ఖరీదే రూ.12 లక్షలు
ప్రజాధనాన్ని భారీగా వృథా చేశారు
అయినా.. వినియోగంలోకి తెస్తాం
పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘‘విశాఖ తీరంలో రుషికొండను తొలిచి జగన్ నిర్మించిన ప్యాలెస్‌ని క్రిమినల్ వేస్ట్ అనొచ్చు.’’ అని మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘‘కొన్ని పాపాలు కడగడానికి జీవితాలు సరిపోవనే చందంగా ఆ ప్యాలెస్ విషయంలో జగన్ చేసిన పాపం ఉంది. జగన్ తన కుటుంబీకులు ఒక్కొక్కరికి ఒక్కో గదిని ఇవ్వడానికి.. పేద్ద రాజప్రాసాదం మాదిరిగా నిర్మాణం చేశారు. బాత్‌టబ్ రూ.12లక్షలు అంటే ఎంత దారుణంగా జనం సొమ్ము దుబారా చేశారో అర్థం చేసుకోవచ్చు. రాజప్రాసాదం మాదిరిగా నిర్మించడంతో దీని వినియోగంపై సమస్యలు వస్తున్నాయి. ఒక్కోటీ టెన్నీస్ కోర్టంత రూమ్‌లు ఉన్నాయి. దాన్ని మనుగడలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఆతిథ్య రంగంలో ఉన్న వారికి ఈ భవనం ఉపయోగపడుతుందని సబ్ కమిటీ నిర్ణయించింది. కొందరు ముందుకు వచ్చినా రూమ్‌లు చాలా పెద్దవిగా ఉండడంతో వెనక్కి తగ్గారు. భవనంపై చిన్న రూములుగా నిర్మించి హోటల్‌గా నడపవచ్చేమోనని ఆలోచన చేస్తే.. సీఆర్‌జడ్ నిబంధనల ప్రకారం 9 మీటర్ల ఎత్తుకు మించి భవనం ఉండకూడదు. ఇప్పటికే ఉన్న భవనం 9 మీటర్ల ఎత్తు ఉంది. అందుకే అదనపు రూమ్‌ల ప్రతిపాదన వదులుకున్నాం. భవనానికి కింద 9 ఎకరాల్లో 7.50ఎకరాలు సీఆర్‌జడ్ పరిధిలో ఉంది. దీంతో పెద్ద కంపెనీలు వెనక్కి వెళ్లగా.. చిన్న కంపెనీలు వస్తున్నాయి. ఈ సాంకేతిక కారణాలతో ఆ ప్యాలెస్ వినియోగం ఆలస్యమైంది. త్వరలోనే ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం.’’ అని దుర్గేశ్ వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు