Share News

శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:51 AM

స్వేచ్ఛాయుత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా తెలిపారు. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం

  • స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాం

  • సుప్రీంకోర్టు ఆదేశాలతో అదనపు భద్రత

  • సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్‌తో పర్యవేక్షణ

  • సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు

  • ఎన్నికల బందోబస్తులో 36 వేల పోలీసు సిబ్బంది: పునేఠా

  • ఎన్నికల బందోబస్తులో 36 వేల పోలీసులు

  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా

అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): స్వేచ్ఛాయుత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా తెలిపారు. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలకు అదనపు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఏకగ్రీవాలు మినహాయించి, 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 92 పట్టణ స్థానికసంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయని వివరించారు.

భారీ సంఖ్యలో ఎన్నికల సిబ్బంది

ఎన్నికల నిర్వహణ కోసం వివిధ స్థాయిల్లో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు కమిషనర్‌ వివరించారు. పోలింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌, ఇతర పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఎన్నికల వీడియో ఫుటేజీ భద్రపరిచే గడువును 40 రోజుల నుంచి 60 రోజులకు పెంచామన్నారు. అదే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల్లో ఎన్నికల కేసులు పెండింగ్‌లో ఉన్న సందర్భాల్లో వీడియో ఫుటేజీని ఆ కేసుల పరిష్కారం అయ్యే వరకు భద్రపరిచేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత...

పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద సీసీటీవీ నిఘాతో పాటు, నిరంతర పోలీసు బందోబస్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పునేఠా తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలను హైపర్‌ సెన్సిటివ్‌, సెన్సిటివ్‌, నార్మల్‌ పోలింగ్‌ స్టేషన్లుగా వర్గీకరించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి మల్లికార్జున, ఐజీ రాజకుమారి తెలిపారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సుల సురక్షిత రవాణా, రూట్‌ క్లియరెన్స్‌, భద్రత కోసం 1543 రూట్‌ మొబైల్‌ వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామన్నారు. బందోబస్తు కోసం 36,351 మంది పోలీసు సిబ్బందిని నియమించామని చెప్పారు.

Updated Date - Nov 01 , 2026 | 03:51 AM