Share News

రొటేషన్‌లో రిజర్వేషన్ల నిర్ధారణ నేడే

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:10 AM

‘స్థానిక’ శంఖారావంతో పట్టణాలు, గ్రామాల్లో ఎన్నికల కోలాహం మొదలైంది. ముందుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రక్రియ ఊపందుకుంది.

రొటేషన్‌లో రిజర్వేషన్ల నిర్ధారణ నేడే

  • పట్టణాలు/నగరాల్లో ఉత్కంఠ!

  • మొదట ఎస్టీలకు కేటాయింపు

  • ఆ తర్వాత వరుస క్రమంలో ఎస్సీలు, బీసీలు, ఓసీలు, మహిళలకు..

  • రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం

  • ముందుగా మున్సిపోల్స్‌..

  • తర్వాత పరిషత్‌లు, పంచాయతీలకు

అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ‘స్థానిక’ శంఖారావంతో పట్టణాలు, గ్రామాల్లో ఎన్నికల కోలాహం మొదలైంది. ముందుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రక్రియ ఊపందుకుంది. రిజర్వేషన్ల నిర్ధారణకు పురపాలక శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం వాటిని ఖరారు చేయనున్నారు. దీంతో వార్డు సభ్యుల నుంచి సర్పంచ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కార్పొరేషన్‌ మేయర్‌ దాకా ఏ స్థానిక సంస్థలో ఏ కేటగిరీకి రిజర్వు అవుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్‌, జడ్పీ చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల ఖరారును మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్లు నిర్ధారిస్తారు. రిజర్వేషన్లను మొదట ఎస్టీలకు కేటాయిస్తారు.

అనంతరం ఎస్సీలు, బీసీలు, ఓసీలు, మహిళలకు వరుస క్రమంలో కేటాయిస్తారు. రిజర్వేషన్ల సైకిల్‌ 2021ఎన్నికల్లో ప్రారంభం కావడంతో ఇప్పుడు చైర్‌పర్సన్లు, మేయర్లకు దాని ఆధారంగా రొటేషన్‌ విధానం అవలంబిస్తారు. ఉదాహరణకు.. గత ఎన్నికల్లో నెల్లూరు మేయర్‌ పదవి ఎస్టీ(మహిళ)కి వచ్చింది. ఈ సారి వేరే కేటగిరీకి కేటాయించాలి. ఎస్టీ జనాభాలో మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ రెండో స్థానంలో ఉండడంతో ఇక్కడ మేయర్‌ పదవి ఎస్టీలకు రిజర్వు కావచ్చన్న అంచనాలు వేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌ రిజర్వేషన్లపై సైతం ఊహాగానాలు ఎక్కువయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో వార్డులు, డివిజన్ల విభజన జరగడంతో వాటికి మాత్రం రొటేషన్‌ ఉండదు. కొత్తగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీలకు.. అనంతరం పంచాయతీలకు ఎన్నికలు జరుపుతారు.


ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో ప్రాధాన్యం..

జగన్‌ హయాంలో వార్డు సభ్యులు, కార్పొరేటర్ల ద్వారా మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్లను ఎన్నుకునే విధానం అమలుచేశారు. కూటమి ప్రభుత్వం చట్ట సవరణ చేసి.. మేయర్లు, మున్సిపల్‌, నగర పంచాయతీల చైర్‌పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికలు తెచ్చింది. దీంతో కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ.. అసెంబ్లీ ఎన్నికల కంటే తీవ్రంగా ఉండొచ్చని అంటున్నారు. గతంలో ఆయా కార్పొరేటర్లు/ కౌన్సిలర్ల పరిధి పరిమితం కావడంతో ఎన్నికల్లో పెద్ద హడావుడి ఉండేది కాదు. మేయర్‌, చైర్‌పర్సన్లను వారు ఎన్నుకునే సమయంలో మాత్రం కాస్త డ్రామా నడిచేది. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలతో గట్టి పోరే నడుస్తుందని అంటున్నారు. ఆర్థికంగా అభ్యర్థులకు భారమయ్యే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు ముందే పలువురు స్థానిక నేతలు అభ్యర్థిత్వాల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చలు సాగిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 04:10 AM