Share News

లిక్కర్‌ స్కామ్‌లో సీఈవో వివేక్‌ యాదవ్‌కు నోటీసు!

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:01 AM

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో ఐఏఎస్‌ అధికారి వివేక్‌ యాదవ్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. జగన్‌ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ కమిషనర్‌గా పనిచేసిన ఆయనకు మద్యం విధానం అమలు...

లిక్కర్‌ స్కామ్‌లో సీఈవో వివేక్‌  యాదవ్‌కు నోటీసు!

  • నేడు ఆయన కార్యాలయంలోనే సిట్‌ విచారణ

  • వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ కమిషనర్‌గా బాధ్యతలు

అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో ఐఏఎస్‌ అధికారి వివేక్‌ యాదవ్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. జగన్‌ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ కమిషనర్‌గా పనిచేసిన ఆయనకు మద్యం విధానం అమలు, ఆర్డర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్ఎస్‌) ప్రక్రియ, అప్పటి అడ్డగోలు నిర్ణయాలు, రికార్డుల తారుమారు తదితర అంశాలపై అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి సమాచారాన్ని నమోదు చేసుకోవడానికి దర్యాప్తు అధికారులు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న వివేక్‌ యాదవ్‌ ‘సర్‌’ కార్యక్రమంలో తీరిక లేకుండా ఉన్నారు. దీంతో పలుమార్లు ఆయన విచారణ వాయిదా పడింది. ఇటీవల విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవ విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చి ఇచ్చిన 164 స్టేట్‌మెంట్‌లో... ‘వివేక్‌ యాదవ్‌పై ఒత్తిడి తెచ్చినా అడ్డగోలు నిర్ణయాల ఫైళ్లపై సంతకాలు చేయలేదు’ అని చెప్పినట్లు సమాచారం.


మద్యం స్కామ్‌లో కీలక నిందితుడైన సత్య ప్రసాద్‌ తన వాంగ్మూలంలోనూ వివేక్‌ యాదవ్‌ ఎలాంటి తప్పూ చేయలేదని కోర్టుకు వివరించారు. అయితే అప్పట్లో తప్పులు చేసిందెవరు? చేయురచింది ఎవరు? అనే విషయాలపై ఎక్సైజ్‌ మాజీ కమిషనర్‌ నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి కోర్టులో చార్జిషీట్‌ వేయాల్సి ఉంది. తాజాగా మరో నోటీసు జారీ చేసిన సిట్‌కు శనివారం తాను విచారణకు సిద్ధమని వివేక్‌ యాదవ్‌ తెలిపినట్లు సమాచారం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన వద్దకే దర్యాప్తు బృందం వెళ్లి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నట్లు తెలిసింది. ఊరు, పేరు లేని మద్యం బ్రాండ్లకు ప్రాధాన్యం, ఓఎఫ్ఎస్‌ విధానాన్ని మాన్యువల్‌గా మార్చడం, తదితర అంశాలపై వివేక్‌ యాదవ్‌ వివరణ తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో సీఎంవోలో పనిచేసిన వ్యక్తులు, ఎక్సైజ్‌ అధికారులు, లిక్కర్‌ వ్యాపారులను ప్రశ్నించిన సిట్‌ అధికారులు స్కామ్‌లో కింగ్‌ పిన్‌ రాజ్‌ కసిరెడ్డి, అతని అనుచరగణాన్ని విచారించి రిమాండ్‌కు పంపింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ శాఖ మాజీ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ సిట్‌ అధికారులకు అప్పటి నిర్ణయాలపై ఏమి చెబుతారు? ఎలాంటి రహస్యాలు వెల్లడిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 04:01 AM