Share News

వచ్చే మార్చి నాటికి భూసమస్యలన్నింటికీ పరిష్కారం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:47 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మాచవరంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నీరు జీవమైతే, భూమి జీవితమని అన్నారు. కోనసీమ అంటే మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి గుర్తుకొస్తారని పేర్కొన్నారు.

వచ్చే మార్చి నాటికి భూసమస్యలన్నింటికీ పరిష్కారం: సీఎం చంద్రబాబు
Andhra Pradesh Land Problems

అంబేద్కర్ కోనసీమ, సెప్టెంబర్ 9: జిల్లాలోని మాచవరంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నీరు జీవమైతే, భూమి జీవితమని అన్నారు. కోనసీమ అంటే మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి గుర్తుకొస్తారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు తమ ప్రభుత్వం నాంది పలికిందన్నారు. సామాజిక బాధ్యతగా పీ4 కార్యక్రమాన్ని తీసుకువచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని.. భూముల హక్కుల విషయంలో పారదర్శకత ఉండేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాస్‌బుక్‌లు తయారు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 56 లక్షల పాస్‌బుక్‌లను పంపిణీ చేయాల్సి ఉందని.. అవినీతికి తావులేకుండా వాటిని అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అనేక భూ సమస్యలను పరిష్కరించామని.. మిగిలిన సమస్యలపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు భూముల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సాంకేతికతను వినియోగిస్తున్నామని.. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలోని పెండింగ్ భూసమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.


55 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలే చేశా..

తాను 55 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. ముఖ్యమంత్రిగా 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో విలువలతో కూడిన రాజకీయాలే చేశానని.. సంపదపై తనకు ఎలాంటి ఆశ లేదని పేర్కొన్నారు. నంద్యాలలో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్ట్ చేసి 53 రోజులు అన్యాయంగా జైలులో పెట్టారని ఆరోపించారు. తన అరెస్టుకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు స్పందించారని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాడి తనకు సంఘీభావం తెలిపారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్‌ను బలవంతంగా విశాఖ నుంచి పంపించారని అన్నారు. కక్ష తీర్చుకోవాలంటే ఒక్క నిమిషంలో అరెస్ట్ చేయించి జైలుకు పంపగలనని.. కానీ తనకు సహనం ఎక్కువని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జగన్‌ను ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి దూరం పెట్టారని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనను ప్రస్తావిస్తూ.. వివేకానందరెడ్డిని క్రూరంగా హత్య చేసిన తర్వాత ఆయన కుమార్తె సునీత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని కోరారని, అనంతరం పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఆ రోజే హత్యకు పాల్పడిన దోషులను అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తల్లి, చెల్లి పడుతున్న పరిస్థితిని ప్రజలు చూశారని చంద్రబాబు అన్నారు.


14 డీఎస్సీలు పెట్టాను.. ఏడాదిలోనే ఉద్యోగాలు ఇచ్చాం..

రాష్ట్రంలో 14 డీఎస్సీలు నిర్వహించి, ఏడాదిలోనే ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే ఏడాది తర్వాత డీఎస్సీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ అంశంపై కొందరు వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టులు చీవాట్లు పెట్టినా వారికి బుద్ధి రావడం లేదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సంజీవినిగా మారిందని చంద్రబాబు అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Updated Date - Sep 09 , 2026 | 02:02 PM