Share News

ధాన్యం సేకరణకు కొత్త విధానాలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:34 AM

రాష్ట్రంలో ధాన్యం అమ్మకాల ప్రక్రియలో కొత్త విధానాలను తీసుకొచ్చినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ వెల్లడించారు.

ధాన్యం సేకరణకు కొత్త విధానాలు

  • ఏఐఎంఎస్‌ యాప్‌లో రైతులకు వెసులుబాట్లు

అమరావతి, నవంబరు10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం అమ్మకాల ప్రక్రియలో కొత్త విధానాలను తీసుకొచ్చినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ వెల్లడించారు. ఏపీ వ్యవసాయ సమాచార యాజమాన్య విధానం(ఏపీఏఐఎంఎస్‌) ఫార్మర్‌ యాప్‌లో ధాన్యం సేకరణ సేవను కొత్తగా చేర్చినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2026 ఖరీఫ్‌ సీజన్‌లో నమోదైన రైతులందరికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సారి ధాన్య సేకరణలో ఫార్మర్‌ ఐటీ తప్పనిసరి చేసినట్లు తెలిపారు.

‘ఈ కొత్త విధానం వల్ల రైతులు తమ మొబైల్‌లో ఏపీఏఐఎంఎస్‌ ఫార్మర్‌ యాప్‌ ద్వారా స్వయంగా ధాన్యం అమ్మకాల తేదీ, సమయాన్ని నమోదు చేసుకోవచ్చు. దీని వల్ల సమయం, శ్రమ ఆదా కావడంతో పాటు అధికారులను సంప్రదించాల్సిన అవసరం లేదు. పనులు వాయిదా వేసుకుని క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉండదు. పైగా రైతులు ఎక్కడి నుంచైనా తమ సాగు భూమి ఉన్న రైతుసేవా కేంద్రం పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించుకోవటానికి షెడ్యూల్‌ను నిర్ణయించుకోవచ్చు. తమ పంటను మొత్తంగా లేదా విడతల వారీగా అమ్ముకోవచ్చు. షెడ్యూల్‌ చేసిన తర్వాత వివరాలను ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖకు అందుతాయి. వరికి కనీస మద్దతు ధర క్వింటా గ్రేడ్‌-ఏ రకానికి రూ.2,461, కామన్‌ రకానికి రూ.2,441 పొందవచ్చు’ అని ఆయన వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:36 AM