ఉద్యోగ నియామకాల నిబంధనల్లో కీలక మార్పులు
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:12 AM
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖలోని ఉద్యోగాల నియామక నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ.. కొత్తగా స్థానిక క్యాడర్ విధానానికి అనుగుణంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పరిశ్రమల శాఖలో సవరణలతో ఉత్తర్వులు జారీ
అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖలోని ఉద్యోగాల నియామక నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ.. కొత్తగా స్థానిక క్యాడర్ విధానానికి అనుగుణంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ (1993)లో పలు సవరణలు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూలై 15 నుంచి ఈ సవరణలు అమల్లోకి వచ్చాయి. గత ఏడాది జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం పరిశ్రమల శాఖ పరిధిలోని పోస్టులను కూడా వివిధ స్థానిక క్యాడర్లుగా ఏర్పాటు చేసి ప్రత్యక్ష నియామకాలు, సీనియారిటీ, పదోన్నతులు, బదిలీ తదితర సేవా అంశాలను ఆయా యూనిట్ల పరిధిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ (ఐపీవో) పోస్టులకు ఇక నుంచి ఆయా జోన్ల పరిధిలోని యూనిట్ల వారీగా ప్రత్యక్ష నియామకాలు ఉంటాయి. వీటిలో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. ఐపీవో పోస్టుకు ఇకపై దేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. కనుక ప్రస్తుతం ఉన్న ఐపీవో (నాన్-టెక్నికల్) మాత్రమే కొనసాగుతారు. ఇక నుంచి ఆ కేటగిరీలో కొత్త నియామకాలు ఉండవు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ కార్యాలయంలోని ఐపీవో పోస్టులను స్థానిక జోన్ క్యాడర్‌కు చెందిన సర్వీస్ సభ్యులతో టెన్యూర్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
పలు పోస్టుల కేటగిరీలు తొలగింపు
సర్వీస్ రూల్స్‌లో ఉన్న పలు పోస్టుల కేటగిరీలను ప్రభుత్వం తొలగించింది. వీటిలో స్టాటిస్టికల్ అసిస్టెంట్, కమర్షియల్ ఆర్టిస్ట్, ప్రోపగండా ఆఫీసర్, మార్కెటింగ్ ఇన్‌స్పెక్టర్, డ్రాప్ట్స్‌మన్, డిమానిస్ట్రేటర్, హోసియరీ ఆర్టిజన్, ల్యాబ్ అటెండర్, మెకానిక్, లైబ్రేరియన్, ఫుట్‌వేర్ డెమానిస్ట్రేటర్, ట్రైనింగ్ డెమానిస్ట్రేటర్, సబ్-రిజిస్ట్రార్, సీనియర్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక