నోటీసులిచ్చే అధికారం సిట్ అధికారికి ఉంది
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:10 AM
మద్యం రవాణా కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలని నోటీసులు జారీచేసే అధికారం సిట్ దర్యాప్తు అధికారికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణకు హాజరుకావాలని కోరుతూ ...
బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద అవి చెల్లుతాయి
దర్యాప్తునకు సహకరించాలి: కసిరెడ్డికి హైకోర్టు ఆదేశం
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలని నోటీసులు జారీచేసే అధికారం సిట్ దర్యాప్తు అధికారికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణకు హాజరుకావాలని కోరుతూ బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179కింద సిట్ దర్యాప్తు అధికారి జారీ చేసిన నోటీసులు చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. కసిరెడ్డి హాజరు అవసరమని భావిస్తే జస్కరణ్ జీత్ సింగ్ డియో కేసులో సుప్రీం కోర్టు జారీచేసిన మార్గదర్శకాలు, బీఎన్ఎ్సఎస్ నిబంధనలు అనుసరించి నోటీసులు జారీచేయాలని ఐవోకు స్పష్టం చేసింది. వాట్సాప్ ద్వారా కాకుండా చట్టంలో నిర్దేశించిన విధానంలో మాత్రమే జారీ చేయాలని పేర్కొంది.
దర్యాప్తునకు సహకరించాలని కసిరెడ్డిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గంధం సునీత మంగళవారం తీర్పు ఇచ్చారు. మద్యం రవాణా పేరుతో ప్రభుత్వ ఖజానాను దోచుకున్న వ్యవహారంలో సెప్టెంబరు 30న విచారణకు హాజరుకావాలంటూ సెప్టెంబరు 28న వాట్సప్ ద్వారా సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు హాజరైన సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, చట్ట నిబంధనలు పాటించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి మంగళవారం నిర్ణయం వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత