జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌పై మీ అభిప్రాయమేంటి?
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:35 AM
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ.. ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ యూనిట్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఎ. వెంకటేశ్వర్లు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
డెడికేటెడ్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధం.. రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య వాదనలు
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ.. ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ యూనిట్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఎ. వెంకటేశ్వర్లు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తమిళనాడు తరహాలో చట్టం తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీనిని విచారించిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే వ్యాజ్యంలో తనను రెండో పిటిషనర్‌గా ఇంప్లీడ్ చేయాలని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
సోమవారం జరిగిన విచారణలో వెంకటేశ్వర్లు తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ.. ఇంప్లీడ్ పిటిషన్‌పై అభ్యంతరం లేదన్నారు. ప్రధాన వ్యాజ్యంతో పాటు జస్టిస్ ఈశ్వరయ్య వేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై సాకేంతికంగా అభ్యంతరాలు ఉన్నాయని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. జస్టిస్ ఈశ్వరయ్య స్వయంగా వాదనలు వినిపిస్తూ.. రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైతే సంబంధిత జీవోలను సవాల్ చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. జస్టిస్ ఈశ్వరయ్య బదులిస్తూ.. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పన విషయంలో తమిళనాడు తరహాలో చట్టం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రధాన వ్యాజ్యంలో అభ్యర్థన ఉందన్నారు. వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. చట్టం తీసుకొచ్చే విషయంలో పిటిషనర్ అభ్యర్థనకు పరిమితమై వ్యాజ్యంపై విచారణ చేస్తామని తెలిపారు. ఏజీ స్పందిస్తూ.. చట్టం తీసుకొచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరడంపై అభ్యంతరం తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం