Share News

తుది తీర్పునకు లోబడే డేటా సెంటర్‌

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:38 AM

విశాఖ జిల్లాలోని అడవివరం, ముడసర్లోవ గ్రామాల పరిధిలో ఏర్పాటు కానున్న హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ నిర్మాణం తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

తుది తీర్పునకు లోబడే డేటా సెంటర్‌

  • సొంత రిస్క్‌తో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించవచ్చు

  • భారీ పెట్టుబడి పెట్టామనే కారణంతో ఈక్విటీ కోరడానికి వీల్లేదు

  • డేటా సెంటర్‌ యాజమాన్యానికి హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లాలోని అడవివరం, ముడసర్లోవ గ్రామాల పరిధిలో ఏర్పాటు కానున్న హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ నిర్మాణం తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సొంత రిస్క్‌తో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించవచ్చని, వ్యతిరేక తీర్పు వస్తే భారీ పెట్టుబడి పెట్టామనే కారణంతో ఈక్విటీ కోరడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. పర్యావరణ నిబంధనలకు లోబడి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని స్పష్టం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. అడవివరం, ముడసర్లోవ గ్రామాల పరిధిలోని 160 ఎకరాల దేవదాయ శాఖ భూమిని హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌కు కేటాయించడాన్ని చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ జల్‌ బిరాదరి జాతీయ కన్వీనర్‌ విశాఖకు చెందిన బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ పిల్‌ మంగళవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. డేటా సెంటర్‌ ఏర్పాటుకు దేవదాయ శాఖకు చెందిన భూముల లీజు విషయంలో చట్ట నిబంధనలు పాటించలేదన్నారు.


డేటా సెంటర్‌ నిర్మాణం విషయాన్ని దాచిపెట్టి భవన నిర్మాణం పేరుతో అనుమతులు తీసుకున్నారన్నారు. అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ... ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఈ ఏడాది జూన్‌ 10న రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ పర్యావరణ అనుమతులు మంజూరు చేసిందన్నారు. ప్రాజెక్టు కారణంగా పర్యావరణం దెబ్బతింటుందనేందుకు ఎలాంటి ఆధారాలను పిటిషనర్‌ కోర్టు ముందు ఉంచలేదన్నారు. డేటా సెంటర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రత్యేక పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో చెప్పిందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం... పర్యావరణ అనుమతులను సవాల్‌ చేస్తూ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ ఉన్నప్పటికీ... పిల్‌పై విచారణ జరిపేందుకు అది అవరోధం కాదని పేర్కొంది. హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కోర్టు ఇచ్చే తుది తీర్పుకి లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:38 AM