జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక నామినేషన్ సెంటర్లు!
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:01 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ స్వేచ్ఛగా జరిగేందుకు ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటుకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
వైసీపీ పిటిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ స్వేచ్ఛగా జరిగేందుకు ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటుకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి తీర్పును రిజర్వ్ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసే పరిస్థితులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సాధారణంగా ఏర్పాటు చేసే నామినేషన్ కేంద్రాలకు అదనంగా ప్రతి జిల్లా కేంద్రంలో నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరారు. ఈ విషయంలో వినతిపత్రం సమర్పించినా ఎస్ఈసీ నుంచి స్పందన లేదన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాది అశ్వినీ కుమార్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. నామినేషన్ వేయడానికి మూడు రోజుల సమయం ఉంటుందన్నారు. మొదటి రోజు నామినేషన్ వేయనీయకుంటే సంబంధిత అభ్యర్థి ఎన్నికల అధికారిని ఆశ్రయించవచ్చన్నారు. కేవలం ఆందోళనతో ఫలానా విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరలేరని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో నామినేషన్ కేంద్రం ఏర్పాటుకు చట్టనిబంధనలు అనుమతించవన్నారు. నామినేషన్ కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఎన్నికల అధికారి పరిధిలోని అంశమని తెలిపారు. నామినేషన్, పోలింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిందన్నారు.
ఇరువైపుల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలను మోహరించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర హోంశాఖలను ఆదేశించాలని, అలాగే అభ్యర్థులకు కులధ్రువీకరణ, నోడ్యూస్ సర్టిఫికెట్ల జారీ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ వైసీపీ వేర్వేరుగా దాఖలు చేసిన మరో రెండు పిటిషన్లపై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత బుధవారం ఈ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..