Share News

‘గ్రూప్‌-1’ అప్పీళ్లపై తీర్పు రిజర్వ్‌

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:40 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలను నిర్ధారిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.

‘గ్రూప్‌-1’ అప్పీళ్లపై తీర్పు రిజర్వ్‌

  • జవాబుపత్రాల మూల్యాంకనంపై హైకోర్టులో ముగిసిన వాదనలు

  • అక్రమాలు జరిగాయనే దానికి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదు

  • సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టివేయండి

  • ఉద్యోగాలకు ఎంపికైన వారి రిప్లై వాదన

అమరావతి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలను నిర్ధారిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌, జస్టిస్‌ హరిహరనాథ శర్మ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. గ్రూప్‌-1 జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని నిర్ధారించడంతో పాటు పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి 2024 మార్చిలో 13న తీర్పు ఇచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, పొందనివారు వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వాస్తవాలు తేల్చేందుకు హైకోర్టు సీఐడీ డీజీ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేసింది. అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసి సిట్‌ తుది నివేదిక దాఖలు చేసింది.


ఉద్యోగాలకు ఎంపికైన వారి వాదన ఇదీ..

అప్పీళ్లు సోమవారం విచారణకు రాగా.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభినంద్‌ కుమార్‌ షావలి, సీవీ మోహన్‌రెడ్డి, పి.శ్రీరఘురామ్‌ రిప్లై వాదనలు వినిపించారు. ‘మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడమే తప్ప ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదు. పొరపాట్ల కారణంగా ఫలానా వ్యక్తి, ఫలానా గ్రూపు లాభపడిందని సిట్‌ ఎక్కడా చెప్పలేదు. ఏపీపీఎస్సీ అందించిన బ్లూ, బ్లాక్‌ పెన్నులను మాత్రమే వ్యాల్యుయేషన్‌ కోసం వినియోగించారు. ఓంఎంఆర్‌ వాల్యుయేషన్‌ స్లిప్పుల పై వేరే ఇంకు లేదు. డిజిటల్‌ మూల్యాంకనంలో ఎంపికైన అభ్యర్థులలో 62 శాతం మంది తదుపరి నిర్వహించిన మాన్యువల్‌ మూల్యాంకనంలో ఎంపిక కాలేదని, అక్రమాలు జరగకుంటే ఈ స్థాయిలో వ్యత్యాసం ఉండదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.

వాస్తవానికి డిజిటల్‌ మూల్యాంకనం సైతం నిబంధనలకు అనుగుణంగా జరగలేదు. అర్హత లేని వారితో జవాబుపత్రాల మూల్యాంకనం చేయించారు. ఈ విషయాన్ని సిట్‌ తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. అప్పటి ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి కార్యదర్శి పీఎస్ఆర్‌ ఆంజనేయులు నిబంధనలకు విరుద్ధంగా హాయ్‌ల్యాండ్‌లో చేపట్టిన ప్రక్రియకు ఎలాంటి విలువ ఉండదు. ఉద్యోగాలకు ఎంపికైన, ఎంపిక కాని అభ్యర్ధుల్లో 97 శాతం మంది అభ్యర్ధుల ఓఎంఆర్‌ వ్యాల్యుయేషన్‌ స్లిప్పులపై దిద్దుబాట్లు ఉన్నాయని సిట్‌ చెబుతోంది. సిట్‌ నివేదిక ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులకే అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టివేసి అప్పీళ్లను అనుమతించండి’ అని వాదించారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 05:40 AM