కేంద్ర బలగాలను మోహరించలేం
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:28 AM
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేంద్ర సాయిధ పోలీసు బలగాలను మోహరించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర హోంశాఖను ఆదేశించాలన్న వైసీపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేంద్ర సాయిధ పోలీసు బలగాలను మోహరించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర హోంశాఖను ఆదేశించాలన్న వైసీపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వి. సుజాత స్పందిస్తూ.. ‘‘పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికల సందర్భంగా హైకోర్టు ఆదేశాలతో కేంద్ర పోలీసు బలగాలను మోహరించారని పిటిషనర్ చెబుతున్నారు. అక్కడి పరిస్థితులతో ఏపీలో ఉన్న పరిస్థితులను పోల్చి చూడలేం. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్ఈసీ, పోలీసులను ఆదేశిస్తున్నాం. ఈ నెల 16న డీజీపీ ఇచ్చిన ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించాలని ఆదేశిస్తున్నాం.’’ అని అన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఐడీ కార్డులను స్పష్టంగా కనిపించేలా ధరించాలని, ఎన్నికల పరిశీలకులు కోరినప్పుడు వాటిని చూపించేలా సర్క్యులర్ జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్ఈసీ) ఆదేశించారు.
అలా కోరలేరు: ఏజీ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ‘‘సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎస్ఈసీ అదనపు బలగాలను మోహరిస్తుంది. శుక్రవారం జరిగిన పుంగనూరు, రాయచోటి ఘటనలను బూచిగా చూపించి కేంద్ర సాయిధ బలగాలను మోహరించాలని పిటిషనర్ కోరలేరు. ఓ రాజకీయ పార్టీ ఎంపీ కాన్వాయ్ బారికేడ్లను ఢీకొడుతూ నామినేషన్ కేంద్రం ప్రాంగణంలోకి ప్రవేశించడంతోనే ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోను పరిశీలన నిమిత్తం కోర్టు ముందు ఉంచాం. పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర సాయిధ బలగాలను మోహరించారని, ఇక్కడ కోరడం సరికాదు. ఆ రాష్ట్రంలో సాధారణ ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ హింసపై ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన నివేదిక, పూర్వ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కేంద్ర బలగాలను మోహరించారు. ఏపీలో అలాంటి పరిస్థితులు లేవు.’’ అని పేర్కొన్నారు.
అభ్యర్థుల భద్రతకు చర్యలు తీసుకోండి
మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల భద్రత కు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నామినేషన్ల దాఖలు నుంచి ఫలితాలు ప్రకటించే వరకు అభ్యర్థులకు భద్రత కల్పించేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ లేళ్ల అప్పిరెడ్డి వేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ స్పందిస్తూ.. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతను పటిష్ఠం చేయాలని డీజీపీకి లేఖ రాశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పంది స్తూ..
‘‘పోటీచేసే అభ్యర్థి భద్రత కల్పించాలని కోరితే, నిజంగా అతనికి ప్రాణహాని ఉందా అనే విషయాన్ని పరిశీలించి పోలీసులు చర్యలు తీసుకుంటారు.’’ అని పేర్కొన్నారు. వివరాలు నమోదుచేసిన న్యాయమూ ర్తి జస్టిస్ వి.సుజాత.. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. కాగా, పోటీచేసే అభ్యర్థులకు వారిపై నమోదైన కేసుల వివరా లు అందించేలా ఆదేశాలివ్వాలన్న పిటిషన్పై న్యా యమూర్తి స్పందిస్తూ.. 2 రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి స్పష్టం చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలను సకాలంలో ఇచ్చేలా ఆదేశించాలన్న పిటిషన్పై స్పందిస్తూ.. ఇది రెవెన్యూ అధికారుల పరిధిలోని వ్యవహారమని గుర్తుచేశారు. గురజాలలో అభ్యర్థులకు భద్రత కల్పించేలా ఆదేశించాలని కోరుతూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు