సొసైటీ పేరుతో పిల్స్ వేయడమేంటి?
ABN , Publish Date - Sep 29 , 2026 | 03:46 AM
సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రైట్స్(ఎస్‌పీసీపీఈఆర్) పేరుతో భారీ సంఖ్యలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్స్) దాఖలు కావడం పై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. సొసైటీ పూర్వాపరాల గురించి ఆరా తీసింది.
పిటిషనర్లకు అనుమతి ఎవరిచ్చారు?.. జడ శ్రవణ్‌ను ప్రశ్నించిన ధర్మాసనం
‘ఎస్‌పీసీపీఈఆర్’ పేరుతో దాఖలవడంపై, నిబంధనలు పాటించకపోవడంపై సందేహం
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రైట్స్(ఎస్‌పీసీపీఈఆర్) పేరుతో భారీ సంఖ్యలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్స్) దాఖలు కావడం పై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. సొసైటీ పూర్వాపరాల గురించి ఆరా తీసింది. సొసైటీ ఎక్కడ రిజిస్టర్ అయ్యింది?. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?. అని సొసైటీ తరఫున హాజరైన న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ను ప్రశ్నించింది. సొసైటీ పేరుతో వేర్వేరు వ్యక్తులు పలు పిల్స్ దాఖలు చేస్తున్నారని గుర్తు చేసింది. ఆ సొసైటీ బైలాస్ ఏమిటి?. పిల్స్ వేయడానికి పిటిషనర్లకు ఎవరు అనుమతి ఇచ్చారు?. అందుకు సొసైటీ చేసిన తీర్మానాలు ఏమిటి? వంటి వివరాలు తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. పిల్ దాఖలు చేసేందుకు నిబంధనలు పాటించట్లేదని ఆక్షేపించింది.
వివరాలు సమర్పించేందుకు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ సమయం కోరడంతో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్‌పీసీపీఈఆర్ పేరుతో వేర్వేరు వ్యక్తులు భిన్న అంశాలపై దాఖలు చేసిన నాలుగు పిల్స్ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. దీంతో ధర్మాసనం సొసైటీ పూర్వాపరాల గురించి ఆరా తీసింది. ఒకే సొసైటీ పేరు మీద వేర్వేరు వ్యక్తులు పిల్స్ వేయడంపై సందేహం వ్యక్తం చేసింది. న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ బదులిస్తూ.. ఎస్‌పీసీపీఈఆర్ ప్రధాన కార్యాలయం విజయవాడ, గాంధీనగర్‌లో ఉందన్నారు. వ్యవస్థలో లోపాలను ప్రశ్నించేందుకు 2018 నుండి సొసైటీ పనిచేస్తోందని తెలిపారు. వ్యక్తులుగా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే బెదిరింపులు రావడంతో సొసైటీ తరఫున వివిధ జిల్లాలో పలువురు ఆర్‌టీఐ అప్లికేషన్లు వేస్తున్నారని చెప్పారు. సొసైటీ పేరు మీద పిల్స్ వేయడంలో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. సొసైటీ బైలాలు, పిల్స్ వేసేందుకు చేసిన తీర్మానాలు, ఆథరైజేషన్ వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..