Share News

సజ్జల భార్గవ్‌ తీరు అనాగరికం

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:20 AM

సోషల్‌ మీడియాలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సోషల్‌ మీడియా మాజీ ఇన్‌చార్జ్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి, ఇతర నిందితులు అనాగరికంగా, అనైతికంగా, ఆటవికంగా, సంస్కారహీనంగా ప్రవర్తించారని హైకోర్టు ...

సజ్జల భార్గవ్‌ తీరు అనాగరికం

  • ‘సోషల్‌’ పోస్టుల వ్యవహారంలో నిందితులు అనైతికంగా, సంస్కారహీనంగా ప్రవర్తించారు

  • సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్టులు

  • చట్ట ప్రకారం వారిపై కఠినంగా వ్యవహరించాలి

  • ‘అఫిడవిట్‌’ తీసుకుని ఎల్‌వోసీ రద్దు చేయండి: హైకోర్టు

  • దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్‌కు ఆదేశం

  • రాజ్యాంగం వాక్‌ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రసాదించినా.. అది సంపూర్ణమైన హక్కు కాదు. ఇతరులు గౌరవంగా జీవించే హక్కుకు భంగం కలగకుండా ఆ హక్కుకు పరిమితులు ఉన్నాయి. సోషల్‌ మీడియా కేసులలో దర్యాప్తు అధికారులు సక్రమంగా దర్యాప్తు పూర్తి చేసి, సరైన అభియోగాలు నమోదు చేసి, నిర్ణీత గడువులోగా కోర్టుల్లో శిక్షలు పడేలా చేయాలి. నేరానికి పాల్పడినవారు ఎంతటి ఉన్నతస్థితిలో ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదనే హెచ్చరిక పంపాలి.

- హైకోర్టు

అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సోషల్‌ మీడియా మాజీ ఇన్‌చార్జ్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి, ఇతర నిందితులు అనాగరికంగా, అనైతికంగా, ఆటవికంగా, సంస్కారహీనంగా ప్రవర్తించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వారి కుటుంబ సభ్యుల గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా నిందితులు తెగబడ్డారని పేర్కొంది. ఇలాంటి చర్యల పట్ల చట్టప్రకారం కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. ఇతరుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ప్రముఖులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాలలో అసభ్యకర, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వల్ల వారి ప్రతిష్ఠ దెబ్బతినడమేగాక, తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నారని పేర్కొంది. అంతేగాక ప్రజల మధ్య విశ్వాసం బలహీనపడటమే కాకుండా ద్వేషాన్ని పెంచుతాయని, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపింది. పౌరుల గోప్యత హక్కును కూడా హరిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఎవరైనా ఏదైనా అంశం, విధానాలపై తమ అభిప్రాయాన్ని, అసమ్మతిని వ్యక్తం చేయవచ్చని, అయితే అది గౌరవప్రదంగా ఉండాలని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో ఇమిగ్రేషన్‌ అధికారులు తనపై జారీ చేసిన ఎల్‌వోసీని రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్‌ చేశారు. శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నిర్ణయం వెల్లడించారు. ‘సోషల్‌ మీడియాలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పిటిషనర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు సక్రమంగా సాగడానికి, సాక్ష్యాధారాల సేకరణ, నిందితుడు విచారణకు హాజరయ్యేలా చూడటం కోసం పిటిషనర్‌పై ఎల్‌వోసీ జారీ చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ కోరడంలో తప్పులేదని భావిస్తున్నాం.


దర్యాప్తు సంస్థ కోరిన మీదట బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ ఎల్‌వోసీ జారీ చేయడం చట్టవిరుద్ధమేమీ కాదు. అయితే నిందితుడు సజ్జల భార్గవ్‌ రెడ్డికి బీఎన్‌ఎ్‌సఎస్‌ 35(3) ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన తరువాత ఆయనకు నోటీసు జారీ చేసినట్లు, నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు కోర్టు ముందు ఎలాంటి ఆధారాలూ లేవు. చట్టంలో పేర్కొన్న విధంగా ఎల్‌వోసీపై రి వ్యూ చేసి దానిని పొడిగించాలా? లేదా? అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత కేసులో అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆ మేరకు చర్యలు తీసుకున్నట్లు ఎలాంటి వివరాలు లే వు. దర్యాప్తు కొనసాగుతుందనే నెపంతో ఎల్‌వోసీని కొనసాగించడం వల్ల పిటిషనర్‌ వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కుకు భంగం కలుగుతుంది. ఈ నేపథ్యంలో భార్గవ్‌రెడ్డిపై ఎల్‌వోసీని కొనసాగించడం సమర్థనీయం కాదు’ అని కోర్టు పేర్కొంది.

నిందితుడు భార్గవ్‌ రెడ్డి అడ్రస్‌, ఈ-మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలను సాయంత్రం 5 గంటలలోగా రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు అందజేయాలని భార్గవ్‌రెడ్డి తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఈ సమాచారాన్ని డీజీపీ, అన్నమయ్య జిల్లా ఎస్పీకి పంపించాలని పీపీకి స్పష్టం చేసింది. కేసుల దర్యాప్తునకు సహకరిస్తానని, ఐవో కోరినప్పుడు విచారణకు హాజరవుతానని, తన దగ ్గర ఉన్న ఆధారాలు, కీలకపత్రాలు దర్యాప్తు సంస్థ కోరినప్పుడు అందజేస్తానని పేర్కొం టూ రెండు రోజుల్లో డీజీపీ, ఎస్పీ వద్ద అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అఫిడవిట్‌ అందిన వెంటనే ఎల్‌ఓసీని ఉపసంహరించుకోవాలని ఎస్పీకి, సమాచారం అందిన వెంటనే ఎల్‌వోసీని తీసివేయాలని ఇమిగ్రేషన్‌ అధికారులను ఆదేశించింది.

Updated Date - Apr 18 , 2026 | 03:20 AM