Share News

హేమంత్‌ కాలును భద్రపరచండి

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:54 AM

రాప్తాడులో విద్యార్థినిపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన అంశంలో దాఖలైన అనుబంధ వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు విచారించింది.

హేమంత్‌ కాలును భద్రపరచండి

  • పోలీసులు, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాప్తాడులో విద్యార్థినిపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన అంశంలో దాఖలైన అనుబంధ వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు విచారించింది. పోలీసు కాల్పుల నేపథ్యంలో తొలగించిన అతని కాలును భద్రపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. పిల్‌లో విద్యాశాఖ అధికారులను ఇంప్లీడ్‌ చేసేందుకు నిరాకరించింది. పిల్‌లో చేసిన అభ్యర్థనకు, విద్యాశాఖ అధికారులను ఇంప్లీడ్‌ చేయాలని కోరడానికి ఏమైనా సంబంధం ఉందా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇంప్లీడ్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

పిల్‌పై తదుపరి విచారణను డిసెంబరు 30కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్‌ సా మిషన్‌తో దాడి చేసిన హేమంత్‌పై పోలీసులు జరిపిన కాల్పుల ఉదంతంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ మంగళగిరికి చెందిన న్యాయవాది గుండా గోపి కృష్ణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. అలాగే తొలగించిన హేమంత్‌ కాలును భద్రపరచాలని, విద్యాశాఖ అధికారులను ప్రతివాదులుగా చేర్చాలని మరో రెండు అనుబంధ పిటిషన్లు వేశారు.


ఈపిల్‌ మంగళవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది బాలయ్య వాదనలు వినిపించారు. ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది(ఎస్‌జీపీ) ఎస్‌.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం నిందితుడు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. తొలగించిన నిందితుడి కాలుకు ప్రొసీజర్‌ ప్రకారం ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తొలగించిన కాలును భద్రపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 04:54 AM