Share News

‘కేపీఐఎల్‌పై పిల్‌’లో కౌంటర్‌ వేయలేదేం?

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:04 AM

పారిశ్రామిక పార్కు అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేపీఐఎల్‌) దుర్వినియోగం చేస్తోందని పేర్కొంటూ దాఖలైన పిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

‘కేపీఐఎల్‌పై పిల్‌’లో కౌంటర్‌ వేయలేదేం?

  • రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం అసహనం

  • అధికారులకు రూ.7 వేలు ఖర్చులు విధింపు

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక పార్కు అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేపీఐఎల్‌) దుర్వినియోగం చేస్తోందని పేర్కొంటూ దాఖలైన పిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆగస్టు 25న చివరి అవకాశం ఇచ్చినప్పటికీ, కౌంటర్‌ దాఖలుకు గనులు, పరిశ్రమలశాఖ తరఫు న్యాయవాది మరింత సమయం కోరడంపై మండిపడింది. కౌంటర్‌ వేసేందుకు చివరి అవకాశం ఇస్తూ.. సంబంధిత అధికారికి రూ.7వేలు ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని అధికారుల జేబుల నుంచి వసూలు చేసి, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి జమ చేయాలని ఆదేశించింది. కృష్ణపట్నం సెజ్‌ భూములతో ముడిపడి ఉన్న అప్పీళ్లను ప్రస్తుత పిల్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను నవంబరు 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.


శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వివిధ గ్రామాల పరిధిలో మల్టీ ప్రొడక్ట్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(సెజ్‌) పారిశ్రామిక పార్కు అభివృద్ధికి కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు సేల్‌ డీడ్‌ ద్వారా 4,731 ఎకరాలు కేటాయించారని, పారిశ్రామిక పార్కు అభివృద్ధిలో ఆ సంస్థ విఫలమైనందున భూకేటాయింపును రద్దు చేసి, భూమిని తిరిగి స్వాధీనం చేసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గూడూరుకు చెందిన ఎన్‌.మునీంద్రరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. కేఐపీఎల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది విల్సన్‌ వాదనలు వినిపిస్తూ... సేల్‌ డీడ్‌లను రద్దుచేస్తూ 2024 సెప్టెంబరు 11న ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి రద్దు చేశారని గుర్తు చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వేసిన అప్పీళ్లపై విచారణను ధర్మాసనం నవంబరు 12కి వాయిదా వేసిందని, వాటిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుత పిల్‌ దాఖలు చేసిన పిటిషనర్‌ వెనుక సిరి ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ ఉందన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 05:04 AM