చట్టం తీసుకొస్తేనే బీసీలకు న్యాయం!
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:29 AM
స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందని అఖిల భారత బీసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య స్పష్టం చేశారు.
హైకోర్టులో వాదనలు వినిపించిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందని అఖిల భారత బీసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీ గణన పూర్తి చేసి, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆ సమాఖ్య గతేడాది దాఖలు చేసిన వ్యాజ్యంలో తనను రెండవ పిటిషనర్‌గా ఇంప్లీడ్ చేయాలని కోరుతూ జస్టిస్ ఈశ్వరయ్య హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. సోమవారం జరిగిన విచారణలో జస్టిస్ ఈశ్వరయ్య స్వయంగా వాదనలు వినిపిస్తూ.... స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కేవలం ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పన కోసమే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని తెలిపారు.
ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందన్నారు. రాష్ట్ర చట్టసభల్లో తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపి చట్టం చేస్తేనే బీసీలకు జనాభాకు తగ్గట్లు రిజర్వేషన్లు దక్కుతాయన్నారు. చట్టం తీసుకొచ్చిన కారణంగానే తమిళనాడు రాష్ట్రంలో బీసీలతో సహా రిజర్వేషన్లు 69శాతానికి చేరాయన్నారు. పంచాయితీరాజ్ శాఖ తరఫున న్యాయవాది నాగూర్ నాగరాజు వాదనలు వినిపిస్తూ...బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించడంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం వద్ద వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసిందని నివేదించారు.
ఇంప్లీడ్ పిటిషన్‌పై అభ్యంతరం ఉందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని తెలిపారు. దీంతో ప్రధాన వ్యాజ్యంతో పాటు ఇంప్లీడ్ పిటిషన్‌లో కౌంటర్ వేయాలని న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి ప్రభుత్వాన్ని ఆదేశించారు. విచారణను అక్టోబరు 1కి వాయిదా వేశారు. రాష్ట్రంలో బీసీ గణన పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆ సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ అల వంకటేశ్వర్లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..