Share News

ప్రత్యేక మేజిస్ట్రేట్‌ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోండి: హైకోర్టు

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:08 AM

ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో మేజిస్ట్రేట్‌ పరిధిలోకి వచ్చేవాటి విచారణ కోసం ప్రత్యేక మేజిస్ట్రేట్‌ కోర్టు ఏర్పాటు చేసేందుకు ..

ప్రత్యేక మేజిస్ట్రేట్‌ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోండి: హైకోర్టు

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల్లో మేజిస్ట్రేట్‌ పరిధిలోకి వచ్చేవాటి విచారణ కోసం ప్రత్యేక మేజిస్ట్రేట్‌ కోర్టు ఏర్పాటు చేసేందుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విజయవాడలోని ఎనిమిదవ అదనపు ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌/సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) కోర్టును ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక మేజిస్ట్రేట్‌గా గుర్తించాలని హైకోర్టు నిర్ణయాన్ని తెలియపరుస్తూ ఇంచార్జి రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌) ఈ నెల 9న న్యాయశాఖ కార్యదర్శికి ప్రొసీడింగ్స్‌ పంపారని గుర్తు చేసింది. హైకోర్టు ప్రొసీడింగ్స్‌కు అనుగుణంగా ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఏజీ చెబుతున్నారని, ఈ నేపథ్యంలో వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.

తనపై నమోదైన ఓ కేసును ప్రజాప్రతినిధుల కేసులను విచారించే ప్రత్యేక ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు విచారించాల్సి ఉండగా.. ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే విజయవాడలోని సెషన్స్‌ జడ్జి కోర్టుకు బదిలీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ నేత కాకాణి గోవర్దన్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల విషయంలో ప్రత్యేక ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు విచారించాల్సి కేసులను సైతం సెషన్స్‌ జడ్జి కేడర్‌ కలిగిన విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు విచారించేందుకు వీలు కల్పిస్తూ 2018 ఏప్రిల్‌ 3న న్యాయశాఖ జారీ చేసిన జీవో 250లోని సంబంధిత భాగాన్ని రద్దు చేయాలని కోరారు.

ఈ జీవో కారణంగా సెషన్‌ కోర్టులో అప్పీల్‌ వేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నామన్నారు. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై నేరుగా హైకోర్టుకు రావాల్సి వస్తోందన్నారు. ప్రత్యేక మేజిస్ట్రేట్‌ కోర్టును ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 05:08 AM