Share News

చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీకి చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:33 AM

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై దృష్టి పెట్టాలని, చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది.

చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీకి చర్యలు తీసుకోండి

రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఆదేశం

అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై దృష్టి పెట్టాలని, చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని.., వారు తీసుకున్న చర్యలు, అవలంబించిన పద్ధతులను తెలియజేస్తూ స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కాకినాడ పనసపాడు కాలనీకి చెందిన జి.శ్రీకాంత్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం...

రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది కాలంలో అదృశ్యమైన చిన్నారుల వివరాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ పిల్‌ బుధవారం మరోసారి విచారణకు రాగా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదని, ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అవకాశం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది జయంతి తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,508 మిస్సింగ్‌ కేసులు నమోదు కాగా 4,284 మంది ఆచూకీ కనుగొన్నామన్నారు. మరో 224మంది ఆచూకీ లభించలేదన్నారు. వివరాలు కోర్టు ముందు ఉంచామన్నారు. కోర్టు విచారణను వాయిదా వేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి

హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..

Updated Date - Oct 15 , 2026 | 05:33 AM