Share News

మన దృష్టి ఆ పిల్లల సంక్షేమంపైనే ఉండాలి: జస్టిస్ లీసా గిల్

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:33 PM

చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లవాడైనా.. రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లవాడైనా.. మన దృష్టి ఎల్లప్పుడూ ఆ పిల్లల సంక్షేమం పైనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు.

 మన దృష్టి ఆ పిల్లల సంక్షేమంపైనే ఉండాలి: జస్టిస్ లీసా గిల్
Justice Lisa Gill

అమరావతి, సెప్టెంబర్ 5: చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లవాడైనా.. రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లవాడైనా.. మన దృష్టి ఎల్లప్పుడూ ఆ పిల్లల సంక్షేమం పైనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు. అవసరాన్ని బట్టి అమల్లోకి తెచ్చిన వివిధ సవరణలు, సంస్కరణలు మన దేశంలోని పిల్లల హక్కులు, ఆత్మగౌరవం, భవిష్యత్‌ను పరిరక్షించడానికి ఒక బలమైన పునాదిని అందించాయని పేర్కొన్నారు. పిల్లలు సామాజిక నిర్లక్ష్యానికి, పేదరికానికి బాధితులుగా మారుతుంటారని, పిల్లలలో సహజంగానే ఒక ప్రత్యేకమైన సున్నితత్వం ఉంటుందని ఆమె అన్నారు.


శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ.. ‘వివిధ జువైనల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్లు అన్ని జిల్లాల్లోని ప్రత్యేక చైల్డ్ కేర్ హోమ్‌ల ఏర్పాటు, పనితీరు గురించి మాట్లాడుకుంటాం. చట్టం లక్ష్యాలు, ఉద్దేశాలకు అనుగుణంగా పిల్లలకు అనుకూలమైన విధానాలను అవలంబించడం గురించి మాట్లాడుతాం. ఇది పునరావాస న్యాయం, సంస్థాగత జవాబుదారీతనంపై ఆధారపడి ఉంటుంది. మన దత్తత ప్రక్రియలను సరళీకృతం చేశామని కూడా గర్వంగా చెప్పుకుంటాం’..


‘నిజానికి ఈ రోజు ఇక్కడ చేరిన మనమందరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన ప్రయత్నాలలో మనం ఎంతవరకు విజయం సాధించాం? చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లల సంఖ్య తగ్గిందా? సంరక్షణ, రక్షణ అవసరమైన పిల్లల సంఖ్యలో తగ్గుదల ఉందా? వారి జీవితాలను తిరిగి నిర్మించుకోవడానికి తగిన సౌకర్యాలను మనం వారికి అందించగలుగుతున్నామా? మన అబ్జర్వేషన్ హోమ్‌లు, స్పెషల్ హోమ్‌లు, భద్రతా కేంద్రాలు అని పిలవబడే ప్రదేశాలలో సౌకర్యాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? మనం మన పిల్లలను సరిగ్గా కాపాడు కోగలుగుతున్నామా?’..


‘నిజానికి ఈ పిల్లలే మన దేశపు భవిష్యత్. మన భవిష్యత్ ఈ పిల్లల భద్రతపైనే ఆధారపడి ఉంది. మనం చాలా దూరం వచ్చాం. కానీ, ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరికీ మన వ్యవస్థలో ఉన్న స్పష్టమైన, నిలకడలేని లోపాల గురించి బాగా తెలుసు. ఆ లోపాలు మన కళ్లముందే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా దగ్గర పూర్తి గణాంకాలు, వివరాలు ఉన్నప్పటికీ, ఈ సమయంలో నేను ఆ వివరాల్లోకి వెళ్లడం లేదు. నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరతతో మనం ఇబ్బంది పడుతున్నాం’..


‘పిల్లలకు అనుకూలమైన విధానాలను అమలు చేయడంలో స్థిరత్వం లేకపోవడం, మనందరిలోనూ ఒక రకమైన నిర్లక్ష్యం, మూస ధోరణి కనిపిస్తాయి. మనం ఎదుర్కొంటున్న మరొక పెద్ద సవాలు డిజిటల్ ప్రపంచం నుంచి వస్తోంది. సైబర్ బుల్లీయింగ్, ఆన్‌లైన్ బాల లైంగిక వేధింపులు, పిల్లలకు అందుబాటులో ఉన్న అపరిమితమైనడిజిటల్ ఎక్స్‌పోజర్ ఇవన్నీ మనం తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలు. మనం మౌనంగా ప్రేక్షకులుగా ఉండిపోలేం. మన పిల్లలను కాపాడుకోవడానికి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ చట్టపరమైన, మానసిక మద్దతు వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందాలి. కేవలం చర్చలు జరిపి, వాటిని ముందుకు తీసుకెళ్లకుండా వదిలేసే వెసులుబాటు మనకు లేదు’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులతో 10న పలు రైళ్ల రద్దు

ప్రపంచ పటంలో మార్పులు: ఆఫ్రికా పెద్దగా.. అమెరికా చిన్నగా..

Updated Date - Sep 05 , 2026 | 12:48 PM