పోలీసులపై ‘ఎర్ర’ స్మగ్లర్ల తిరుగుబాటు
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:40 AM
కాఫీ పౌడర్ డబ్బాల మాటున కంటైనర్లో తరలిస్తున్న ఎర్రచందనాన్ని వైఎస్సార్ కడప జిల్లా కాశినాయన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
కాఫీ పౌడర్ మాటున ఎర్ర చందనం స్మగ్లింగ్
వాహన తనిఖీల సమయంలో గొడ్డళ్లతో దాడికి యత్నం
8 మంది అరెస్టు.. 1,984 కిలోల చందనం దుంగలు స్వాధీనం
కడప క్రైం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కాఫీ పౌడర్ డబ్బాల మాటున కంటైనర్లో తరలిస్తున్న ఎర్రచందనాన్ని వైఎస్సార్ కడప జిల్లా కాశినాయన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో కడప రెడ్శాండర్స్ టాస్క్ఫోర్స్ సీఐ శ్రీరామ్, పోరుమామిళ్ల సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఉదయం కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలోని రహదారిలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మూడు వాహనాలను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా వాటిలో ఉన్న స్మగ్లర్లు గొడ్డళ్లు, రాళ్లతో పోలీసులపై దాడికి యత్నించారు. వారి దాడి నుంచి తప్పించుకున్న పోలీసులు.. చాకచక్యంగా వ్యవహరించి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో తమిళనాడుకు చెందిన ఆరుగురు, బెంగళూరు, ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. కంటైనరులో కాఫీ పౌడరు పెట్టెల అడుగున ఉన్న 70 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 1,984 కిలోలు బరువున్న ఈ దుంగలు రూ.81,34,400 విలువ చేస్తాయని అంచనా వేశారు. అలాగే ఐషర్ కంటైనరు, తుఫాను వాహనం, మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు, 643 కాఫీ పౌడరు పెట్టెలు, ఐదు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో పాటు అన్నీ కలిపి రూ.1.30 కోట్ల విలువ చేస్తాయని ఎస్పీ తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్ను ఢీకొని కార్గో నౌక మునక..