Share News

మైనింగ్‌ అక్రమాలపై ఉక్కుపాదం!

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:20 AM

మైనింగ్‌, ఇసుక తవ్వకాల వంటి అక్రమాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని, ఈ అక్రమాలను నిరోధించేందుకు సమగ్ర వ్యవస్థ ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది.

మైనింగ్‌ అక్రమాలపై ఉక్కుపాదం!

  • ఆ మేరకు సమగ్ర వ్యవస్థ ఉండాలి.. అధికారులను బాధ్యులను చేయాలి

  • ఆమంచి పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు

అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): మైనింగ్‌, ఇసుక తవ్వకాల వంటి అక్రమాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని, ఈ అక్రమాలను నిరోధించేందుకు సమగ్ర వ్యవస్థ ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించేందుకు ఓ వ్యవస్థ లేకపోవడం వల్లే మైనింగ్‌ అక్రమాలు జరుగుతుందని పేర్కొంది. వీటిని నిరోధించడంలో విఫలమవుతున్న అధికారులను బాధ్యులను చేసి, వారి పై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న మరికొన్ని వ్యాజ్యాలు బుధవారం విచారణకు రానున్న నేపథ్యంలో ప్రస్తుత పిల్‌ను వాటితో కలిపి విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.

బాపట్ల జిల్లా చీరాల మండలం కవురివారిపాలెం గ్రామంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో సూత్రధారులను గుర్తించేందుకు విశ్రాంత న్యాయమూర్తి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలోని స్వతంత్ర కమిటీతో విచారణకు ఆదేశించాలని కోరుతూ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గ్రామంలోని సర్వే నెంబర్లు 47, 607లలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, రవాణాను నిలిపివేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది మనోజ్‌ వాదనలు వినిపిస్తూ.. వాహనాల డ్రైవర్ల మీద కేసులు పెట్టి పోలీసు, మైనింగ్‌, రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకొంటున్నారని తెలిపారు. మైనింగ్‌ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది సాయి విహారి వాదనలు వినిపిస్తూ.. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, ప్రైవేటు స్థలాల్లో ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోలేమని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 06:20 AM