Share News

70 మంది వైద్యులకు ఉద్వాసన

ABN , Publish Date - Oct 03 , 2026 | 05:40 AM

విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై ఆరోగ్యశాఖ మరోసారి కొరడా ఝుళిపించింది. గత మే నెలలో డీఎంఈ (డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) పరిధిలో 51 మందిని తొలగించగా.

70 మంది వైద్యులకు ఉద్వాసన

  • సుదీర్ఘకాలం గైర్హాజరీలో ఉన్న వారిపై చర్యలు

  • మరో 154 మంది వైద్యులకు నోటీసులు జారీ

  • డీఎంఈ పరిధిలో 39 మందికి తుది అవకాశం

అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై ఆరోగ్యశాఖ మరోసారి కొరడా ఝుళిపించింది. గత మే నెలలో డీఎంఈ (డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) పరిధిలో 51 మందిని తొలగించగా.. ఈసారి డీఎస్‌హెచ్‌ (డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌) పరిధిలో 70 మంది వైద్యులకు ఉద్వాసన పలికింది. సుదీర్ఘకాలం విధులకు హాజరు కాకుండా, ప్రైవేటు ప్రాక్టీస్‌ చేసుకుంటున్న వారిని గుర్తించి సర్వీస్‌ నుంచి తొలగించింది. డీఎ్‌సహెచ్‌, డీఎంఈ పరిధిలో దాదాపు 263 మంది వైద్యులు విధులకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఆయా విభాగాధిపతులు అనేక సార్లు హెచ్చరించి, షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

కానీ.. వారి తీరులో ఎలాంటి మార్పు లేకపోవడంతో తొలిదశలో డీఎస్‌హెచ్ పరిధిలో 70 మందిని విధుల నుంచి తొలగిస్తూ డైరెక్టర్‌ చక్రధర్‌బాబు నిర్ణయం తీసుకున్నారు. వీరందరికీ టెర్మినేషన్‌ ఆర్డర్లు పంపించారు. వీరితో పాటు మరో 154 మంది వైద్యులు అనధికారికంగా గైర్హాజరీలో ఉన్నారు. వారికి కూడా సంజాయిషీ నోటీసులు జారీచేశారు. డీఎంఈ పరిధిలోని ఆస్పత్రుల్లో విధులకు హాజరుకాని 39 మంది వైద్యులకు ప్రభుత్వం చివరి అవకాశం కల్పించింది. ఏడాదికిపైగా విధులకు గైర్హాజరవుతున్న వీరికి ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు జారీ చేసినప్పటికీ ఎవరూ విధుల్లో చేరలేదు. సర్వీస్‌ నిబంధనలను అనుసరించి వీరికి చివరి అవకాశం కల్పించాలని డీఎంఈ డా.విష్ణువర్థన్‌ నిర్ణయించారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని అన్ని హెచ్‌వోడీ కార్యాలయాల పరిధిలో ఇటీవల తేల్చిన లెక్కల ప్రకారం 493 మంది వైద్యులు, ఇతర సిబ్బంది విధులకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు డీఎంఈ, డీఎస్‌హెచ్‌ విభాగాల్లో సీనియారిటీని నిర్ణయించే అంశాల్లో గందరగోళం నెలకొంది.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 05:40 AM