ఆ భూములు ఫ్రీ హోల్డ్
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:18 AM
గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములు కలిగిన రైతులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఆ భూములకు నిషేధ విముక్తి కల్పిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని రెవెన్యూశాఖ అమల్లోకి ....
1.36 లక్షల ఎకరాల సర్వీసు ఇనామ్ భూములకు నిషేధ విముక్తి
క్రయ, విక్రయాలకు అనుమతి
వాటికి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు
రాష్ట్రంలో అమల్లోకి సీఎం హామీ
రికార్డులు తాజాపరచాలని కలెక్టర్లకు ఆదేశం
మోమో జారీ చేసిన రెవెన్యూ స్పెషల్ సీఎస్
మాట నిలబెట్టుకున్నాం: మంత్రి అనగాని
అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములు కలిగిన రైతులకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఆ భూములకు నిషేధ విముక్తి కల్పిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని రెవెన్యూశాఖ అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,36,024.38 ఎకరాల సర్వీసు ఇనామ్ భూమిని ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తున్నామని, వెంటనే ఆ భూములను గుర్తించి నిషేధ జాబితా 22(ఏ)నుంచి తొలగించాలంటూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శుక్రవారం ఆదేశాలు విడుదలచేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఉటంకిస్తూ ఆయన ప్రత్యేక మెమోను జారీ చేశారు. ఈ భూములపై 2023 జూలై 19న జారీ చేసిన జీవో 310 ప్రకారం సర్వీసు ఇనాం భూములను పట్టా భూములుగా గుర్తిస్తూ, రెవెన్యూ రికార్డులను తాజా పరచాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూశాఖ తాజా నిర్ణయంతో ఆ భూములు పూర్తిగా 22(ఏ) నుంచి బయటపడతాయి. పట్టా భూములుగానే రికార్డుల్లో ఉంటాయి. ఇక ఆ భూములున్న రైతులు, లేదా ఇంతకుముందే కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి భారీ ఊరట లభించనుంది. ఆ భూములను ఫ్రీహోల్డ్‌గా ప్రకటించినందున ఇకపై క్రయ విక్రయాలకు అవకాశం ఏర్పడుతుంది. ఈ అంశంపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)ను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ నేపథ్యం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇనాం భూముల సవరణ చట్టం- 2013ను అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇనాం భూములను, అంటే పట్టా కానివి, ప్రభుత్వ పరిధిలో ఉన్నవాటిని పరిరక్షించేందుకు నిషేధ జాబితాలో చేర్చడం ఈ చట్టం లక్ష్యం. చట్టం అమల్లోకి వచ్చిన నాటినుంచి ఉన్న భూములకు బదులు, తొలి నుంచీ ఉన్న భూములను 22(ఏ)లో చేర్చి రక్షించాలని చట్టంలో ఉంది. దీనివల్ల మొత్తం సర్వీసు ఇనామ్ భూములు అంటే, అప్పటికే రైత్వారీ పట్టాలుగా మారినవి, ఇంకా అనేక క్రయ, విక్రయాలు జరిగిన భూములను కూడా నిషేధ జాబితాలో చేర్చారు.
2023 జూలైలో అప్పటి ప్రభుత్వం జీవో 310 తీసుకొచ్చింది. 2013లో తీసుకొచ్చిన చట్టసవరణ ఇనామ్ గ్రామ సర్వీసు భూములకు వర్తించదని రెవెన్యూశాఖ స్పష్టత ఇచ్చింది. అంటే, రైత్వారీ పట్టాలు కలిగిన 1.36 లక్షల ఎకరాలకు ఆ చట్టసవరణ వర్తించదని, వాటిని పట్టా భూములుగానే గుర్తించాలని అనేక మెమోలు, మార్గదర్శకాలు జారీచేసింది. అయితే, 2023లో వైసీపీ ప్రభుత్వం అసైన్డ్ భూముల సవరణ చట్టంను తీసుకొచ్చింది. రైతులకు అసైన్‌మెంట్ ఇచ్చి 20 ఏళ్లు పూర్తయితే ఆ భూములపై వారికి శాశ్వత హక్కులు కల్పించి నిషేధ జాబితా నుంచి తొలగించాలని ఆ చట్టసవరణ ఉద్దేశం. ఇలా అసైన్‌మెంట్ భూములతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లోని సర్వీసు ఇనాం భూములను కూడా ఫ్రీ హోల్డ్ పరిధిలోకి తీసుకొస్తూ 2023 డిసెంబరు 19న రెవెన్యూశాఖ జీవో 596 జారీ చేసింది. అయితే, ఫ్రీహోల్డ్ ప్రక్రియలో అక్రమాల పై 2024లో కూటమి సర్కారు విచారణ జరిపించింది. 13.58 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్‌చేయగా, అందులో 5.85 లక్షల ఎకరాలను చట్టవిరుద్ధంగా, నిబంధనలను ఉల్లంఘించి నిషేధ జాబితా నుంచి తొలగించారని తేలింది. ఈ నేపథ్యంలో 2024, ఆగస్టులో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత ఆ భూములను తిరిగి 22(ఏ) జాబితాలో ఉంచారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే, నిలిచిపోయిన ఫ్రీ హోల్డ్ జాబితాలో ఉన్న సర్వీసు ఇనాం పట్టా భూములను నిషేధ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వానికి ఇటీవల అనేక విన్నపాలు వస్తున్నాయి. వాటికి రైత్వారీ పట్టాలు ఉన్నాయని, అవి వాస్తవికమైనవని, అందులో ఎలాంటి అక్రమాలు లేవని అధికారులు కూడా తేల్చారు. ఈ నేపథ్యంలో ఆ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించి, వాటిని తిరిగి ఫ్రీ హోల్డ్ చేయాలన్న ప్రతిపాదనలకు ఈనె 8వ తేదీన ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనిపై రిజిస్ట్రేషన్‌శాఖ వెంటనే చర్యలు చేపట్టాలని ఐజీని తాజా ఆదేశాల్లో సీఎస్ ఆదేశించారు.
రైతుల శ్రేయస్సు కోసమే..: అనగాని
గ్రామ సర్వీసు ఇనామ్ భూములకు నిషేధ విముక్తి కల్పిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ వారం రోజుల్లోనే అమల్లోకి వచ్చిందని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి అనగాని తెలిపారు.