పీఆర్‌సీ చైర్మన్‌గా దినేశ్‌కుమార్!
ABN , Publish Date - Oct 01 , 2026 | 03:40 AM
పన్నెండవ వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌ను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ప్రభుత్వోద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం
మాజీ సీఎస్ నియామకంపైఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు
దినేశ్ 1983 బ్యాచ్ అధికారి
రాష్ట్రంలో, కేంద్రంలో కీలక పదవులు
2014లో పీపీఏ చైర్మన్ గానూ నియామకం
2017-18 మధ్య సీఎస్‌గా బాధ్యతలు
అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పన్నెండవ వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌ను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జీతభత్యాలు, సేవా నిబంధనల సవరణ కోసం ఈ కమిషన్‌ను ఉద్దేశించారు. సెప్టెంబరు 5వ తేదీన ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో సమావేశమైనప్పుడు పీఆర్‌సీకి చైర్మన్‌ను నియమిస్తామని సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల వేతనాలను సమీక్షించి, పెరుగుతున్న జీవన వ్యయం, మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్ల కనీస, గరిష్ఠ వేతనాలను నిర్ణయించి ప్రభుత్వానికి పీఆర్‌సీ చైర్మన్ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ప్రభుత్వం వేతనాలు నిర్ణయిస్తుంది.
దినేశ్‌కుమార్ 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2017 మార్చి 31 నుంచి 2018 సెప్టెంబరు 30 వరకు రాష్ట్రానికి సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఏపీలో, కేంద్రలో అనేక కీలకమైన ఉన్నతపదవులు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్‌గా 2014 డిసెంబరులో నియమితులయ్యారు. అంతకుముందు ఆయన కేంద్ర ప్రభుత్వంలో జౌళి అభివృద్ధి కమిషనర్‌గా ఢిల్లీలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్‌గా క్షేత్రస్థాయిలో సమర్థ పరిపాలన అందించారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్ల సమయంలో సహాయ చర్యలు పర్యవేక్షించే విపత్తు నిర్వహణ విభాగంలో బాధ్యతలు నిర్వహించారు. ఆయన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్రప్రభుత్వం కొన్ని నెలల కిందట ఆయన్ను టీటీడీ నెయ్యి కల్తీ వివాదంపై విచారణకు ఏకసభ్య కమిటీ చైర్మన్‌గానూ నియమించింది.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’