Share News

గ్యాస్‌ కొరతపై హైఅలర్ట్‌!

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:37 AM

ఏపీలో వంట గ్యాస్‌ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది.

గ్యాస్‌ కొరతపై హైఅలర్ట్‌!
CM Chandrababu Naidu

  • హోటళ్ల నిర్వాహకులతో చర్చించాలని నిర్దేశం

  • ఆ వెంటనే క్యాబినెట్‌ సబ్‌కమిటీ భేటీ

  • ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులతో చర్చలు

  • గ్యాస్‌ సరఫరాకు ప్రత్యామ్నాయాలపై దృష్టి

  • నగరాల్లో పైపుల ద్వారా సరఫరాకు మొగ్గు

  • పైప్డ్‌ గ్యాస్‌ కంపెనీలతో భేటీకి మంత్రుల నిర్ణయం

  • ఆందోళన వద్దంటూ ప్రజలకు మంత్రుల భరోసా

అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వంట గ్యాస్‌ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఎల్‌పీజీ దిగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కూడా వంట గ్యాస్‌ కొరత ఏర్పడింది. ఈ సమస్య తీవ్రతపై సీఎం చంద్రబాబు స్పందించారు. శనివారం ఉదయం అందుబాటులో ఉన్న పలువురు మంత్రులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్‌ కొరతపై ఆరా తీశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజలు ఆందోళన చెందకుండా ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. ఎంత మేరకు చేయగలమో అంతా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు హోటళ్ల నిర్వాహకులు, భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రులకు సూచించారు.


వివరాలు ఏవీ?

ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ అనంతరం గ్యాస్‌ సమస్య పరిష్కారంపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం శనివారం విజయవాడలోని పౌరసరఫరాల శాఖ భవన్‌లో అత్యవసరంగా భేటీ అయింది. ఈ భేటీకి మంత్రులు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు ప్రత్యక్షంగా హాజరుకాగా.. మరో మంత్రి నాదెండ్ల మనోహర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేస్తున్న చమురు కంపెనీలకు చెందిన రాష్ట్రస్థాయి కో-ఆర్డినేటర్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌, ఐవోసీఎల్‌ ప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులతో మంత్రులు చర్చించారు. రాష్ట్రంలో వంట గ్యాస్‌ రోజువారీ డిమాండ్‌ ఎంత?. ప్రస్తుతం ఎంత మేరకు సరఫరా చేయగలుగుతున్నారు?. ఏ కంపెనీ ఎన్ని సిలిండర్లు సరఫరా చేస్తోందనే సమాచారాన్ని అడిగారు. అయితే.. సదరు వివరాలు తమ వద్ద లేకపోవడంతో అధికారులు నోరెళ్లబెట్టారు. ఆ వివరాలను వెంటనే సమర్పిస్తామని చెప్పారు.


ప్రత్యామ్నాయాలపై..

రాష్ట్రంలో ప్రస్తుతం గ్యాస్‌ కొరత నెలకొన్నందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్‌ సరఫరా చేసే అవకాశాలపై మంత్రులు చర్చించారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, అనంతపురం, కడప, కర్నూలు, కాకినాడ తదితర నగరాల్లో ఇంటింటికీ గ్యాస్‌ పైప్‌లు ఏర్పాటు చేసినందున.. ఆ పైప్‌లైన్ల ద్వారా రిఫైనరీల నుంచి గ్యాస్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. వెంటనే పైప్డ్‌ గ్యాస్‌ కంపెనీలతో సమావేశమై చర్చించాలని మంత్రులు నిర్ణయించారు. గృహావసరాలకు ఆన్‌లైన్‌లోనే గ్యాస్‌ బుక్‌ చేయాలని, వినియోగదారుల నుంచి ఓటీపీ తీసుకున్న తర్వాతే గ్యాస్‌ సిలిండరు డెలివరీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని రాష్ట్రంలో గ్యాస్‌ సరఫరా వ్యవస్థలను మరింత పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రిఫైనరీల్లో గ్యాస్‌ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాస్‌ సిలిండ్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా కట్టుదిట్టుమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేం ద్రాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించారు. బ్లాక్‌ మార్కెట్‌ కు పాల్పడినవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.


ప్యానిక్‌ బుకింగులు వద్దు: పయ్యావుల

రాష్ట్రంలో వంట గ్యాస్‌ సరఫరాలో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకుంటోందని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్యాస్‌ కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్యానిక్‌ బుకింగ్‌లు చేయవద్దని కోరారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా విషయంలో ఆసుపత్రులు, హాస్టళ్లు వంటివాటికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. గ్యాస్‌ కొరతపై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిలిండర్ల బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం 95 శాతం ఆన్‌లైన్‌ బుకింగ్‌లు జరుగుతున్నాయని, 88 శాతం వరకు ఓటీపీ ఆధారిత గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ జరుగుతోందని తెలిపారు. పైపుల ద్వారా నేచురల్‌ గ్యాస్‌ను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.


కొరత లేదు: కమిషనర్‌ గౌర్‌

రాష్ట్రంలో గృహావసరాలకు ఎలాంటి గ్యాస్‌ కొరత లేదని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సౌరభ్‌ గౌర్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,972 టన్నుల ఎల్పీజీ స్టాక్‌ అందుబాటులో ఉన్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్‌ సరఫరాపై వదంతుల కారణంగానే ప్యానిక్‌ బుకింగ్‌లు పెరిగాయని, ఇలాంటి బుకింగ్‌లు చేయకుండా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్లు ఎల్పీజీ పంపిణీదారులతో రోజువారీ సమీక్షలు నిర్వహించాలని, వినియోగదారులకు అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్లు బుక్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్పీజీ డిస్ర్డిబ్యూటర్లు తప్పనిసరిగా స్టాక్‌, పెండింగ్‌ బుకింగ్స్‌, సిలిండర్ల డెలివరీ సమయాలను తెలియజేస్తూ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

రెండు భారత నౌకలకు ‘దారి’!

శ్రీ పరాభవ నామ సంవత్సర రాశిఫలాలు (జన్మనక్షత్రం ఆధారంగా)

Updated Date - Mar 15 , 2026 | 08:05 AM