Share News

పంచాయతీ రిజర్వేషన్లకు కొత్త రూల్స్‌

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:47 AM

రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లలో సభ్యుల స్థానాలు, సర్పంచ్‌, ..

పంచాయతీ రిజర్వేషన్లకు కొత్త రూల్స్‌

  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతమే

  • మహిళలకు ప్రతి కేటగిరీలో సగం స్థానాలు

  • గ్రామ పంచాయతీ నుంచి జడ్పీ వరకు నూతన మార్గదర్శకాలు

  • వీటికి 2021 ఎన్నికల నుంచి రొటేషన్‌

  • జడ్పీ చైర్‌పర్సన్‌ పదవులకు 2026 నుంచే కొత్తగా రిజర్వేషన్‌

అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లలో సభ్యుల స్థానాలు, సర్పంచ్‌, ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్‌ పదవులకు రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని నిర్దేశిస్తూ పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్నది ఈ ప్రతిపాదనలో కీలకాంశం. మహిళలకు ఆయా వర్గాల్లో సగం స్థానాలు కేటాయించే విధానాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది అక్టోబరు 1న ఇచ్చిన ఆదేశాలు, ప్రత్యేక కమిషన్‌ సిఫారసులు, ప్రభుత్వం ఆమోదించిన నిర్ణయాలకు అనుగుణంగా ఈ నిబంధనలను రూపొందించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2020లో జారీచేసిన పంచాయతీరాజ్‌ రిజర్వేషన్‌ నిబంధనల స్థానంలో 2026 నిబంధనలను తీసుకొచ్చారు.

రిజర్వేషన్లలో స్పష్టమైన క్రమం..

రిజర్వేషన్ల ఖరారులో మొదట ఎస్టీలకు, తర్వాత ఎస్సీలకు.. అనంతరం బీసీలకు స్థానాలు కేటాయించే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ కేటాయింపుల తర్వాత ఆయా వర్గాల్లో మహిళలకు రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. అన్‌రిజర్వ్‌డ్‌ స్థానాల్లోనూ మహిళలకు సగం స్థానాలు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి కేటాయించే రిజర్వేషన్లు.. సంబంధిత స్థానాల మొత్తం సంఖ్యలో 50 శాతాన్ని దాటకూడదు. ఈ పరిమితిని గ్రామ పంచాయతీ వార్డులు, సర్పంచ్‌ పదవులు, ఎంపీటీసీ/ఎంపీపీ పరిధిలోని మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు(ఎంపీటీసీ), జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు(జడ్పీటీసీ), మండలాధ్యక్ష పదవులు, జడ్పీ చైర్‌పర్సన్‌ పదవులకు వర్తింపజేసేలా నిబంధనలు రూపొందించారు.


గ్రామ పంచాయతీల్లో ఇలా..

గ్రామ పంచాయతీల్లో వార్డు రిజర్వేషన్లను సంబంధిత ఆర్‌డీవో ఖరారు చేస్తారు. ముందుగా ఎస్టీలకు, ఎస్సీలకు కేటాయించాల్సిన వార్డుల సంఖ్యను నిర్ణయిస్తారు. ఆయా పంచాయతీల్లో సంబంధిత వర్గాల జనాభా నిష్పత్తి ఆధారంగా ఈ లెక్కలు వేస్తారు. ఎస్సీ, ఎస్సీలకు కేటాయించిన స్థానాలు మొత్తం వార్డుల్లో 50 శాతం కంటే తక్కువగా ఉంటే.. మిగిలిన పరిమితిలో బీసీలకు రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. బీసీ వార్డుల కేటాయింపులో గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ ఓటర్ల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతానికి మించి స్థానాలు కేటాయించడానికి వీలుండదు. వార్డుల సంఖ్యను నిర్ణయించే సమయంలో అరశాతం కంటే తక్కువ భిన్నాన్ని వదిలేస్తారు. అర శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఒక స్థానంగా పరిగణిస్తారు.

షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు..

షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిబంధనలు ప్రతిపాదించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో కనీసం సగం వార్డులను ఎస్టీలకు రిజర్వు చేయాలి. ఆ తర్వాత మిగిలిన వార్డులను అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంచుతారు. అలాగే 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న గిరిజన ఆవాసాలు, తండాలతో ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో అన్నీ వార్డులను ఎస్టీలకే కేటాయించే నిబంధన ఉంది. అటువంటి గ్రామ పంచాయతీల సర్పంచ్‌ పదవులనూ ఎస్టీలకే రిజర్వు చేస్తారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని పంచాయతీల సర్పంచ్‌ పదవులన్నింటినీ ఎస్టీలకు కేటాయించే విధానాన్ని అవలంబిస్తున్నారు.


వార్డుల కేటాయింపులో ఓటర్ల నిష్పత్తే కీలకం..

గ్రామ పంచాయతీ వార్డులను ఏ వర్గానికి కేటాయించాలో నిర్ణయించేటప్పుడు.. సంబంధిత వార్డుల్లో ఆయా వర్గాల ఓటర్ల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటారు. ముందుగా ఎస్టీ ఓటర్ల శాతం అత్యధికంగా ఉన్న వార్డులకు ఎస్టీ రిజర్వేషన్లు కేటాయిస్తారు. అనంతరం ఎస్టీలకు కేటాయించిన వార్డులను మినహాయించి ఎస్సీ ఓటర్ల నిష్పత్తి ఎక్కువగా ఉన్న వార్డులను ఎస్సీలకు కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన వార్డుల్లో బీసీ ఓటర్ల నిష్పత్తి ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఒకవేళ అవసరమైన సంఖ్యలో వార్డుల్లో సంబంధిత వర్గాల ఓటర్లు అందుబాటులో లేకపోతే.. ముందుగా ఆ వర్గాల ఓటర్లు ఉన్న వార్డులకు ప్రాధాన్యమిస్తారు. ఇంకా మిగిలిన రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీలో 8 వార్డులు ఉండి.. 6 వార్డులను ఎస్టీలకు కేటాయించాల్సి ఉండగా.. ఎస్టీ ఓటర్లు 3 వార్డుల్లోనే అందుబాటులో ఉంటే, మిగిలిన 3 వార్డులను మిగతా 5 వార్డుల నుంచి లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు.

మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు..

ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్‌ (అన్‌రిజర్వ్‌డ్‌) కేటగిరీల్లో మహిళలకు సగం స్థానాలు కేటాయించాలని ప్రతిపాదించారు. పంచాయతీ వార్డుల్లో మహిళా ఓటర్ల నిష్పత్తి ఆధారంగా సంబంధిత కేటగిరీలో మహిళలకు కేటాయించాల్సిన వార్డులను ఎంపిక చేస్తారు. సర్పంచ్‌, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్‌పర్సన్‌ వంటి పదవుల్లో మహిళల రిజర్వేషన్ల ఖరారుకు.. సంబంధిత నిబంధనల్లో పేర్కొన్న మహిళా జనాభా నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం స్థానాల సంఖ్య బేసి సంఖ్యలో ఉన్నప్పుడు వచ్చే 0.5 భిన్నాన్ని తొలి ఎన్నికలో ఒకటిగా పరిగణించి, తదుపరి ఎన్నికలో విస్మరించే విధానాన్ని ముసాయిదాలో పొందుపరిచారు. మహిళల స్థానాల లెక్కింపులో కేటగిరీల వారీగా వచ్చే భిన్నాలను ఎస్టీ నుంచి అన్‌రిజర్వ్‌డ్‌ వరకు క్రమంగా సర్దుబాటు చేస్తూ అవసరమైన సంఖ్యను చేరుకోవాలి. ప్రతి కేటగిరీలో మహిళా రిజర్వేషన్ల సైకిల్‌ను రెండు ఎన్నికల్లో పూర్తి చేయాలి.


సర్పంచ్‌ పదవుల కేటాయింపు ఇలా..

పంచాయతీల సర్పంచ్‌ పదవుల రిజర్వేషన్లను ఆర్‌డీవో ఖరారుచేస్తారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల సర్పంచ్‌ పదవులను ముందుగా ఎస్టీలకు కేటాయిస్తారు. ఇతర ప్రాంతాల్లో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను నిర్ణయించిన తర్వాత.. మొత్తం రిజర్వేషన్లు 50ు కంటే తక్కువగా ఉంటే బీసీలకు కేటాయింపులు చేస్తారు. ఎంపీటీసీల రిజర్వేషన్లను ఆర్‌డీవో నిర్ణయిస్తారు. ఎంపీపీ, జడ్పీటీసీల రిజర్వేషన్లను కలెక్టర్‌ ఖరారు చేస్తారు. మండలాధ్యక్ష పదవులు, జడ్పీటీసీ స్థానాలు సాధ్యమైనంత వరకు ఒకే రిజర్వేషన్‌ కేటగిరీకి చెందకుండా చూడాలన్న నిబంధన కూడా ఉంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఎస్టీలకు వర్తించే ప్రత్యేక నిబంధనలు అమలవుతాయి.

జడ్పీ చైర్‌పర్సన్‌ పదవులకు ప్రత్యేక మార్పు..

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవుల రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక విధానాన్ని ప్రతిపాదించారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో పూర్తిగా ఉన్న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవులను ఎస్టీలకు కేటాయిస్తారు. మిగిలిన జిల్లా పరిషత్‌లలో ఎస్టీ, ఎస్సీ పదవుల సంఖ్యను రాష్ట్ర జనాభా నిష్పత్తి ఆధారంగా నిర్ణయిస్తారు. పూర్తిగా షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉన్న జిల్లా పరిషత్‌లను సంబంధిత లెక్కింపులో మినహాయిస్తారు. ఎస్టీ, ఎస్సీలకు కేటాయించిన చైర్‌పర్సన్‌ పదవులు మొత్తం పదవుల్లో 50 శాతం కంటే తక్కువగా ఉంటే.. బీసీ ఓటర్ల నిష్పత్తి ఆధారంగా బీసీలకు పదవులను కేటాయిస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కలిపి 50 శాతానికి మించి పదవులు కేటాయించరాదు. రాష్ట్రంలో గతంలో ఉన్న 13 జిల్లా పరిషత్‌లు 2026 సెప్టెంబరు 25 నుంచి 28గా పునర్వవ్యస్థీకరించిన నేపథ్యంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పదవుల రిజర్వేషన్ల రొటేషన్‌ విషయంలో 2026 ఎన్నికలనే తొలి సాధారణ ఎన్నికలుగా పరిగణిస్తారు. గతంలో 13 జిల్లా పరిషత్‌లకు 2021 ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లను ఈ లెక్కింపులో పరిగణనలోకి తీసుకోరు.


రొటేషన్‌ విధానంలో..

పంచాయతీ వార్డులు, సర్పంచ్‌ పదవులు, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీ అధ్యక్ష పదవులు, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను 2021 నుంచి రొటేషన్‌ పద్ధతిలో కొనసాగించాలని ప్రతిపాదించారు. ఒకవేళ కొత్త పంచాయతీ, వార్డు, ఎంపీటీసీ, మండల పరిషత్‌ లేదా జడ్పీటీసీ నియోజకవర్గం ఏర్పాటైతే.. సంబంధిత నిబంధనల ప్రకారం దానికి వర్తించే రిజర్వేషన్‌ను తొలుత లెక్కిస్తారు. ఆ లెక్కల ప్రకారం ఏదైనా కేటగిరీకి అదనపు స్థానం స్పష్టంగా వస్తే.. కొత్త స్థానాన్ని ఈ కేటగిరీకి కేటాయిస్తారు. అలా అదనపు స్థానం నిర్ధారణ కాకపోతే లాటరీ ద్వారా రిజర్వేషన్‌ కేటగిరీని నిర్ణయిస్తారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు ప్రత్యేకంగా మినహాయించిన సందర్భాల్లో ఈ సాధారణ విధానం వర్తించదు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 05:47 AM