50 శాతం మించకుండా రిజర్వేషన్లు సర్దుబాటు
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:08 AM
రాష్ట్రంలో పంచాయతీరాజ్, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ..
డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు ప్రక్రియ
ఎస్సీ, ఎస్టీ కోటా పోను మిగిలినవి బీసీలకు
మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్‌లకు రొటేషన్
వార్డులకు కొత్తగా రిజర్వేషన్లు
బీసీ కోటాపై ప్రభుత్వం మార్గదర్శకాలు
గ్రామీణ సంస్థలకు రొటేషన్‌పై త్వరలో ప్రత్యేక నిబంధనలు జారీ
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీరాజ్, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలు ఆదివారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలకు కల్పించే వర్టికల్ రిజర్వేషన్లను 50 శాతానికి మించరాదని స్పష్టం చేశాయి. ఆయా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల ప్రకారం నిర్ణయించి అమలు చేయాలని ఆదేశించాయి. రిజర్వేషన్లను మొదట ఎస్టీలు, ఆ తర్వాత ఎస్సీలు, అనంతరం బీసీలకు కేటాయించే విధానాన్ని అనుసరించాలని పేర్కొన్నాయి. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సవరణలు చేసింది.
కమిషన్ సిఫారసులు పట్టణ ఎన్నికల్లో..
జనాభా లెక్కల్లో బీసీలకు సంబంధించిన ప్రత్యేక జనాభా గణాంకాలు అందుబాటులో లేని నేపథ్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(యూఎఫ్ఎస్) స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు గణాంకాల ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ సేకరించిన సమకాలీన, వాస్తవ సమాచారాన్ని బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం చివరిగా ప్రచురించిన జనగణన గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్‌ను ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో వివరించింది. దీని ప్రకారం మొదట స్థానిక సంస్థల్లో బీసీల వెనుకబాటుతనంపై సమకాలీన, సమగ్ర, కచ్చితమైన గణాంకాల ఆధారంగా ప్రత్యేక కమిషన్ అధ్యయనం చేయాలి. రెండోది.. ఆ కమిషన్ సిఫారసుల ఆధారంగా ప్రతి స్థానిక సంస్థకు విడివిడిగా బీసీ రిజర్వేషన్ల శాతాన్ని ప్రభుత్వం నిర్ణయించాలి. ఈ ప్రమాణాలను పాటించకుండా ఏకరీతిగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడం న్యాయపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉండటంతో స్థానిక సంస్థల వారీగా కమిషన్ సిఫారసుల ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రామ స్థానిక సంస్థలలో..
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌ల వంటి గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ణయం వర్తించే చట్టాలు, వాటి కింద రూపొందించిన నిబంధనలు, న్యాయస్థానాల ఆదేశాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. బీసీల రిజర్వేషన్లను రాష్ట్రవ్యాప్తంగా ఒకే శాతంతో అమలు చేసే బదులు, డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల ప్రకారం స్థానిక సంస్థల వారీగా నిర్ణయించే విధానానికి తాజాగా ఉత్తర్వులు ప్రాధాన్యమిచ్చాయి. ఏ గ్రామీణ స్థానిక సంస్థలో ఎంత శాతం రిజర్వేషన్ వర్తించాలనే అంశం కమిషన్ సిఫారసులు, చట్టపరమైన నిబంధనలు, న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా ఖరారు చేయాలి. అయితే జీఓలో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లకు వర్తించే బీసీ రిజర్వేషన్ల నిర్దిష్ట శాతాలను విడివిడిగా పేర్కొనలేదు. వాటి గణన, కేటాయింపు విధానాన్ని తదుపరి నిబంధనలు లేదా సవరణల ద్వారా నిర్దేశించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
రొటేషన్ విధానం పట్టణాల్లో..
పట్టణ స్థానిక సంస్థల్లో రెండో సాధారణ ఎన్నికల నుంచి మేయర్లు, చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2021లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్ సైకిల్‌ను ప్రారంభించినందున ఈ ఎన్నికల నుంచి రొటేషన్ విధానాన్ని అనుసరించనున్నారు. అయితే వార్డుల పునర్విభజన చేపట్టినందున వార్డు సభ్యుల రిజర్వేషన్ సైకిల్‌ను తిరిగి కొత్తగా ప్రారంభించాలని స్పష్టం చేసింది. మేయర్లు, చైర్‌పర్సన్ల పదవులు, వార్డు సభ్యుల స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు కేటాయించాల్సిన స్థానాల సంఖ్య, నిర్దిష్ట స్థానాల ఎంపిక విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న సంబంధిత రిజర్వేషన్ నిబంధనలను పాటించాలని ప్రభుత్వం సూచించింది.
పంచాయతీల్లో...
గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల గణన, స్థానికంగా కేటాయింపులు, రిజర్వు చేసిన స్థానాలు, పదవుల రొటేషన్ తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర విధానాన్ని ప్రత్యేకంగా రూపొందించనున్నారు. అవసరమైన చోట ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలకు సవరణ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా జీఓలో రొటేషన్‌కు సంబంధించి పూర్తి విధానాన్ని ప్రకటించలేదు. దీనిపై తదుపరి ప్రత్యేక నిబంధనలు లేదా సవరణలు చేస్తారు. కాగా పంచాయతీ వార్డులకు రొటేషన్ విధానం వర్తించదని తెలుస్తోంది. అయితే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్‌పర్సన్‌లకు రొటేషన్ విధానం వర్తింపచేయనున్నట్టు సమాచారం.
పంచాయతీల పునర్విభజన లేనట్లే
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్విభజన ప్రక్రియ మరో ఐదేళ్లు జరిగే అవకాశం లేదు. గత ఏడాది డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా దూరందూరంగా ఉన్న పంచాయతీలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించడం, దగ్గరలో అందుబాటులో ఉన్న వాటిని విలీనం చేయడం తదితర డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ దరఖాస్తులు స్వీకరించింది. సుమారు 450 పంచాయతీల నుంచి పునర్విభజన కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం ఎమ్మెల్యేలు కూడా సిఫారసులు చేశారు. అయితే ఈ ప్రక్రియ చేపట్టేందుకు అప్పట్లో పంచాయతీ పాలకవర్గాలు ఉండటంతో కొంచెం ఆలస్యమైంది. ఆ తర్వాత రాష్ట్రంలో జనగణన కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే ఏడాది మార్చి వరకు ఏ పంచాయతీల భౌగోళిక స్వరూపం కూడా మార్చేందుకు వీల్లేదని ఆదేశాలిచ్చింది.
దీంతో డీలిమిటేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. పంచాయతీ ఎన్నికలు ఆలస్యమైనందున మార్చి తర్వాత డీలిమిటేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లొచ్చన్న యోచనలో ఉన్నారు. అయితే ఈ లోపే ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల తర్వాత పాలకవర్గాలు వస్తుండటంతో మరో ఐదేళ్లు పునర్విభజన ప్రక్రియ సాధ్యం కాదు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్