Share News

60 రోజుల్లో ఫ్రీహోల్డ్‌!

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:02 AM

భూముల ఫ్రీహోల్డ్‌ దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఇచ్చే దరఖాస్తులను ఆర్‌డీవోలు 60 రోజుల్లోగా పరిష్కరించాల్సిందేనని గడువు నిర్దేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు (జీవో 659) జారీచేశారు.

60 రోజుల్లో ఫ్రీహోల్డ్‌!

  • రైతుల దరఖాస్తుకు 2 నెలల్లో పరిష్కారం

  • దరఖాస్తు చేసిన రోజే తహసీల్దార్‌కు చేరాలి

  • 30 రోజుల్లో అన్ని అధికారిక ప్రక్రియల పూర్తి

  • ఆర్‌డీవోలకు గడువు.. రెవెన్యూ శాఖ జీవో

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): భూముల ఫ్రీహోల్డ్‌ దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఇచ్చే దరఖాస్తులను ఆర్‌డీవోలు 60 రోజుల్లోగా పరిష్కరించాల్సిందేనని గడువు నిర్దేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు (జీవో 659) జారీచేశారు. అసైన్డ్‌ భూములు, చుక్కల భూమి, ఇనామ్‌, షరతు గల పట్టా భూములు చట్టబద్ధంగా ఫ్రీహోల్డ్‌ పరిధిలోకి వచ్చాయని, వాటిని కన్వర్షన్‌ చేయాలని కోరుతూ రైతులు ఇచ్చే దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం భూముల ఫ్రీహోల్డ్‌కు అనుమతిస్తూ.. డివిజన్‌ స్థాయిలో సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డీవోలకు దరఖాస్తుల పరిష్కార బాధ్యతను అప్పగిస్తూ సెప్టెంబరు 15న జీవో 588ని జారీచేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈ జీవో అమలుకు సంబంధించి మూడు అంశాల్లో మరింత స్పష్టత ఇస్తూ.. దరఖాస్తుల పరిష్కారానికి గడువును నిర్దేశించింది. ఫ్రీహోల్డ్‌ దరఖాస్తులు ఆర్‌డీవో, సబ్‌ కలెక్టర్‌ల లాగిన్‌కు వచ్చిన 60 రోజుల్లోగానే పరిష్కరించాల్సిందేనని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. అసైన్డ్‌ భూములకు సంబంధించి వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో రైతు పేరు లేదని, రీసర్వే తర్వాత రికార్డుల్లో నుంచి పేరు తీసేసిన నేపథ్యంలో వెబ్‌ల్యాండ్‌లో తిరిగి చేర్చాలంటూ తహసీల్దార్‌కు దరఖాస్తులు వస్తే, వాటిని 30 రోజుల్లోనే పరిష్కరించాలని గడువు విధించింది. ఫ్రీహోల్డ్‌ కోరుతూ ఆన్‌లైన్‌లో పిటిషన్‌ ఇస్తే, అదే రోజు తహసీల్దార్‌కు చేరాలని దిశానిర్దేశం చేసింది. అలా దరఖాస్తు వచ్చిన నాటి నుంచి 30 రోజుల్లోగా అన్ని రకాల అధికారిక ప్రక్రియలను పూర్తిచేసి ఆర్‌డీవోకు పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది.


ఆ తర్వాత 30 రోజుల్లో ఆ దరఖాస్తును ఆర్‌డీవో పరిష్కరించాలని పేర్కొంది. ఇలా దరఖాస్తు సమర్పించిన 60 రోజుల్లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్రీహోల్డ్‌ చేయాలని స్పష్టత ఇచ్చింది. కాగా, ఒకసారి ఫ్రీహోల్డ్‌కు అర్హత ఉన్న భూములను నిషేధ జాబితా 22(ఏ) నుంచి తొలగించిన తర్వాత.. వెబ్‌ల్యాండ్‌లోనూ రికార్డులు మార్చాలని పేర్కొంది. వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో ఆ భూముల వద్ద ఫ్రీహోల్డ్‌ అనే రిమార్క్‌ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఫ్రీహోల్డ్‌ అయిన భూములపై రిజిస్ట్రేషన్‌లకు అనుమతి ఇవ్వాలని, రిజిస్ట్రేషన్‌ మాడ్యూల్‌లో మార్పులు చేసుకోవాలని రిజిస్ట్రేషన్‌ శాఖను ఆదేశించింది. ఒక్కసారి భూములు ఫ్రీహోల్డ్‌ అయిన తర్వాత రిజిస్ట్రేషన్‌, ఇతర అవసరాల కోసం తదుపరిగా ఎలాంటి ధ్రువపత్రాలు అవసరం లేదని, వెబ్‌ల్యాండ్‌లో ఉండే ఫ్రీహోల్డ్‌ స్టేటస్‌ సరిపోతుందని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 05:02 AM