Share News

షాడో సర్పంచ్‌లకు చెక్‌!

ABN , Publish Date - Oct 01 , 2026 | 03:54 AM

రాష్ట్రంలో ‘షాడో సర్పంచ్‌’ వ్యవస్థకు చెక్‌ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లకు బదులు ఇతరులు పాలనలో జోక్యం చేసుకోవడం, అధికారులపై ప్రభావం చూపడం, అభివృద్ధి పనులు-నిధుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఇక చెల్లబోవని స్పష్టం చేయనుంది.

షాడో సర్పంచ్‌లకు చెక్‌!

  • భార్య పవర్‌ భర్త చెలాయిస్తానంటే కుదరదు

  • అధికారాలు, బాధ్యతలు పూర్తిగా సర్పంచ్‌లకే..

  • గ్రామ పరిపాలన కట్టుదిట్టం దిశగా చర్యలు

  • మూడు నెలలకోసారి సర్పంచ్‌లకు శిక్షణ

  • పంచాయతీ ఎన్నికలకు ముందే ప్రక్రియ పూర్తి

(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘షాడో సర్పంచ్‌’ వ్యవస్థకు చెక్‌ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల్లో ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లకు బదులు ఇతరులు పాలనలో జోక్యం చేసుకోవడం, అధికారులపై ప్రభావం చూపడం, అభివృద్ధి పనులు-నిధుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఇక చెల్లబోవని స్పష్టం చేయనుంది. మరో మూడు, నాలుగు నెలల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు ఉన్నాయి. ఈలోపే గ్రామ పరిపాలనను కట్టుదిట్టం చేసేందుకు నడుం కట్టింది. సాధారణంగా సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రభుత్వం తీసుకొచ్చే సంస్కరణలు అమలవుతాయి. అయితే, ఈ ప్రక్రియకు షాడో సర్పంచ్‌లు పెద్ద అడ్డంకిగా మారడంతో ప్రభుత్వం..

వీరిపై దృష్టిసారించింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ సహకారంతో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌(ఎస్ఐఆర్‌డీ) కమిషనర్‌ కె.వెంకటకృష్ణ సర్పంచ్‌ల పాలనా విధానంలో మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా.. పంచాయతీ పాలనలో సర్పంచ్‌దే ప్రధాన బాధ్యత ఉండేలా వ్యవస్థను పటిష్ఠం చేయనున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌ పేరుతో ఇతరులు అధికారులను సంప్రదించడం, పనుల మంజూరు, బిల్లుల చెల్లింపులు, పంచాయతీ నిధుల వినియోగం వంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో అధికారికంగా బాధ్యతలు ఉన్న ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు మాత్రమే నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ముఖ్యంగా సర్పంచ్‌ల భర్తలు పూర్తిగా పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.


పంచాయతీ వ్యవహారాలపై నిఘా....

పంచాయతీల్లో ఆర్థిక లావాదేవీలు, అభివృద్ధి పనులు, తీర్మానాలు, పరిపాలనా నిర్ణయాలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు డిజిటల్‌ విధానాలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిబంధనల ఉల్లంఘనలపై బాధ్యత నిర్ధారించేలా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని భావిస్తోంది. గతంలో రెండు దఫాలు సర్వేలు నిర్వహించినప్పుడు, సర్పంచుల్లో 84 శాతం మంది అక్షరాస్యులని తేలింది. చదువుకున్న సర్పంచ్‌లు ఎక్కువగా ఉంటున్నందున, వారికి తగిన శిక్షణ ఇస్తే నిర్ణయాధికారం స్వయంగా చేపట్టే అవకాశముందని భావిస్తున్నారు. సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులకు కూడా శిక్షణతోపాటు బాధ్యతలూ ఇవ్వనున్నారు. పంచాయతీ పరిపాలన, నిధుల వినియోగం, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిబంధనలు, డిజిటల్‌ సేవలు తదితర అంశాలపై సర్పంచ్‌లకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించనున్నారు.

సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు ప్రతి మూడు నెలలకోసారి పాలనాపరమైన శిక్షణ అందించనున్నారు. అలాగే, పంచాయతీల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికీ ముగ్గురు సభ్యులతో ప్రత్యేక పర్యవేక్షక బృందాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ బృందం పంచాయతీల్లో సర్పంచ్‌ల అధికారాలు, బాధ్యతల అమలు, అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, అధికారులతో సమన్వయం తదితర అంశాలను పరిశీలించేలా విధివిధానాలు రూపొందించనున్నారు. పంచాయతీ బోర్డు సమావేశాలకు గైర్హాజరైన సభ్యుల ఇళ్ల వద్దకు వెళ్లి, వారు హాజరుకాకపోవడానికి కారణాలను ఈ బృందం అడిగి తెలుసుకుంటుంది. ఉద్దేశపూర్వకంగానే బోర్డు సమావేశాలకు మూడు దఫాలు హాజరుకాని వారిని నిబంధనల ప్రకారం తొలగించే ప్రక్రియ కచ్చితంగా చేపడతారు. అదే విధంగా గ్రామాల్లో ఉండని సర్పంచ్‌ల విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయనున్నారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 03:54 AM