Share News

పేద గుండెకు భరోసా!

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:33 AM

గుండె వైద్యం కోసం పేదలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లోనే సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.

పేద గుండెకు భరోసా!

  • రూ.18 కోట్లతో తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళంలో క్యాథ్‌ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు

  • నాలుగు హార్ట్‌-లంగ్‌ మెషిన్లకు రూ.10 కోట్లు

  • అనంతలో త్వరలో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు ప్రారంభం

  • ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): గుండె వైద్యం కోసం పేదలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లోనే సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే ఉన్న క్యాథ్‌ల్యాబ్‌ను ఆధునికీకరించారని, త్వరలోనే దీని కార్యకలాపాలు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో కొనసాగుతాయని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రుల్లో కూడా కొత్త క్యాథ్‌ల్యాబ్‌ల ఏర్పాటుకు టెండర్‌ ప్రక్రియ కొనసాగుతోందని, వీటి కోసం రూ.18 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.

తిరుపతి, కడప, అనంతపురం, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు మరో 4 హార్ట్‌-లంగ్‌ మెషిన్లు అందించేందుకు రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. కర్నూలు, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు 2డీ ఎకో మెషిన్ల కోసం రూ.2 కోట్లు, ఐసీయూ మానిటర్లు, డీఫిబ్రిలేటర్లు, ఇతర పరికరాల కోసం మరో రూ.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మొత్తంగా గుండె వైద్య పరికరాలు, మౌలిక వసతుల కోసం రూ.34 కోట్లు వ్యయం చేస్తున్నట్లు వివరించారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో త్వరలో ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్సలు ప్రారంభించనున్నామని తెలిపారు. కాకినాడలో 50 వేల చదుపు అడుగుల విస్తీర్ణంలో హార్ట్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 03:34 AM