Share News

ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికి మరోసారి కస్టడీ

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:48 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమెను మరోసారి రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు అనుమతినిచ్చింది.

ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతికి మరోసారి కస్టడీ
AP Endowments Assistant Commissioner Shanthi

విజయవాడ, ఏప్రిల్ 23: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ) కాళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమెను మరోసారి రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు అనుమతినిచ్చింది.

ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న శాంతిని, తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రేపు, ఎల్లుండి (రెండు రోజుల పాటు) శాంతిని ఏసీబీ కస్టడీకి తీసుకునేందుకు అనుమతించింది. ఆమె అక్రమంగా కూడబెట్టినట్లుగా భావిస్తున్న ఆస్తులు, బినామీ వ్యవహారాల గురించి అధికారులు ఆమెను లోతుగా ప్రశ్నించనున్నారు.

ఈ నెల ప్రారంభంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో శాంతికి సంబంధించి భారీగా అక్రమ ఆస్తులు వెలుగు చూశాయి. తాడేపల్లి, విశాఖపట్నం సహా పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో సుమారు 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, ఒక భవనం, ఫ్లాట్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆమె రిమాండ్‌ను మే 5వ తేదీ వరకు కోర్టు పొడిగించిన సంగతి తెలిసిందే.


అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో, నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఆమెను ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ చేసింది. 2020లో దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా చేరిన శాంతి, గతంలో కూడా కొన్ని వివాదాల కారణంగా సస్పెన్షన్‌కు గురై, ఇటీవలే విధుల్లో చేరాల్సి ఉండగా ఈ కేసులో చిక్కుకున్నారు. ఏసీబీ అధికారులు ఈ రెండు రోజుల కస్టడీలో మరిన్ని కీలక ఆధారాలు సేకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2026 | 06:10 PM