ఈహెచ్‌ఎస్ 2.0 ఉద్యోగులకు నగదు రహిత వైద్యం
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:10 AM
ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతపై భరోసా కల్పించేందుకు సర్కారు సన్నద్ధమైంది. ఉద్యోగుల సహకారంతోనే వారికి నాణ్యమైన నగదు రహిత వైద్యం అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఏడాదికి ఒకసారి పూర్తి హెల్త్ చెకప్
మరింత మెరుగ్గా హెల్త్ స్కీమ్ అమలు
మెడికల్ రీయింబర్స్‌మెంట్‌విధానం రద్దు
ఉద్యోగ సంఘాలకు సర్కారు ప్రతిపాదనలు ఉద్యోగుల వాటానుపెంచాలన్న ప్రభుత్వం
సానుకూలంగా స్పందించిన సంఘాల నేతలు
అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతపై భరోసా కల్పించేందుకు సర్కారు సన్నద్ధమైంది. ఉద్యోగుల సహకారంతోనే వారికి నాణ్యమైన నగదు రహిత వైద్యం అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఉద్యోగుల హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్)లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏ ఆస్పత్రిలో చేరినా ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా పూర్తిగా క్యాష్‌లెస్ వైద్యాన్ని అందించాలని భావిస్తోంది. దీనికి ఉద్యోగులు, ఆస్పత్రుల నుంచి పూర్తి సహకారం కోరుతోంది.
రూ.వందల కోట్లు చెల్లిస్తున్నా...
ప్రస్తుతం ఈహెచ్‌ఎస్ కోసం ఉద్యోగులు నెలవారీగా రూ.225, రూ.300 శ్లాబుల్లో వాటా కింద చెల్లిస్తున్నారు. దీనిద్వారా ప్రతినెలా దాదాపు రూ.18 కోట్ల వరకూ ఆర్థిక శాఖకు అందుతోంది. ఉద్యోగుల వాటాకు సమానంగా ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేస్తోంది. అన్నీ కలిపి ఏడాదికి రూ.432 కోట్ల ఈహెచ్‌ఎస్ నిధులు సమకూరుతున్నాయి. ఇవికాకుండా ప్రభుత్వం ఏటా మెడికల్ రీయింబర్స్‌మెంట్ కింద రూ.360 కోట్ల వరకూ అదనంగా ఇస్తోంది. మొత్తంగా ఏడాదికి రూ.792 కోట్లు (ఉద్యోగుల వాటా రూ.216 కోట్లు) ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు పూర్తిగా నగదు రహిత వైద్యం అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం ఈహెచ్‌ఎస్‌లో సౌకర్యాలు పెంచి, ఉద్యోగులు చెల్లించే వాటాను రెండు నుంచి మూడింతలు పెంచాలని ప్రతిపాదించింది.
ఎన్‌ఏబీహెచ్ ఆస్పత్రుల సంఖ్యను పెంచడంతో పాటు ఉద్యోగికి, వారి జీవిత భాగస్వామికి ఏడాదికి ఒకసారి ఉచితంగా అన్నిరకాల హెల్త్ చెక్‌పలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికోసం ఏటా మరో రూ.365 కోట్ల వరకూ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగుల వాటా పోను ఈహెచ్‌ఎస్, రీయింబర్స్‌మెంట్ కలిపి ప్రభుత్వం ఏటా రూ.544 కోట్లు భరిస్తోంది. ఇప్పుడు హెల్ చెక్‌పలు కలిపితే దాదాపు రూ.900 కోట్ల వరకూ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఉద్యోగుల వాటాను పెంచి వారికి మరిన్ని మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇవి అమలైతే మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది.
ఆలోచించి నిర్ణయం: ఉద్యోగ సంఘాలు
ప్రభుత్వ ప్రతిపాదనలపై ఉద్యోగ సంఘాల నేతలు సానుకూలంగా స్పందించారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలు బాగున్నాయని, ఉద్యోగులంతా నగదు రహిత వైద్యాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రులకు రూ.265 కోట్లు బకాయిలు చెల్లించడంతో పాటు జీవో 131ను సక్రమంగా పకడ్బందీగా అమలు చేస్తే ప్రభుత్వానికి సహకరిస్తామని సంఘాల నేతలు భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ ప్రతిపాదనలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలు, ఆస్పత్రుల యాజమాన్యలతో త్వరలో ముఖాముఖి ఏర్పాటు చేస్తామని ట్రస్ట్ అధికారులు తెలిపారు. దీనికి ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఆంగీకరించారు.
ఈహెచ్‌ఎస్‌ను బలోపేతం చేయాలి : విద్యాసాగర్, బొప్పరాజు
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్‌ఎస్ ద్వారా నాణ్యమైన, నిరంతరాయమైన నగదు రహిత వైద్య సేవలు అందేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో వీరు పాల్గొన్నారు. నూతనంగా సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన పద్మావతికి రాష్ట్ర కమిటీల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల వాటాతో పాటు ప్రభుత్వ వాటాను నేరుగా ట్రస్ట్‌కు బదిలీ చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు విద్యాసాగర్ తెలిపారు. విశ్రాంత సీపీఎస్ ఉద్యోగులకు కూడా ఈహెచ్‌ఎస్ వర్తింపజేయాలని ఆయన కోరారు. జీవో 131 జారీ చేయడంపై బొప్పరాజు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ, ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య పాల్గొన్నారు. అమరావతి సచివాలయం, హెచ్‌వోడీల ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ ద్వారా విజయవాడ, గుంటూరుల్లోని ప్రముఖ వైద్యశాలల్లో వైద్యసేవలందేలా చర్యలు తీసుకోవాలని కోరామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గొలిమి రామకృష్ణ తెలిపారు. రమేష్, మణిపాల్, ఆయుష్ ఆసుపత్రుల్లో ఉద్యోగులకు హెల్త్‌కార్డు ద్వారా వైద్యసేవలు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఉద్యోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం