Share News

స్థానిక ఎన్నికలపై ‘ఆ ప్రచారం’ నమ్మొద్దు

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:14 AM

రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తప్పుడు వార్తలు, నకిలీ పత్రాలతో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజలకు, రాజకీయ పార్టీలకు సూచించింది.

స్థానిక ఎన్నికలపై ‘ఆ ప్రచారం’ నమ్మొద్దు

  • ఏదైనా అధికారికంగా మేమే వెల్లడిస్తాం

  • ప్రజలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన

  • ఎన్నికలు 2 నెలలు వాయిదా పడ్డాయని అవాస్తవాలను ప్రచారం చేసిన వారిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తప్పుడు వార్తలు, నకిలీ పత్రాలతో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజలకు, రాజకీయ పార్టీలకు సూచించింది. ఈ విధమైన ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి ఎన్నికల సంఘం పేరుతో వచ్చే అనధికార సమాచారాన్ని ప్రజలు, మీడియా ప్రతినిధులు నమ్మవద్దని అధికారులు స్పష్టంచేశారు. ‘‘రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 21న వాట్సాప్‌, సోషల్‌ మీడియా వేదికల ద్వారా నకిలీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రచారంలోకి వచ్చింది. ఎన్నికల సంఘం అధికారిక లెటర్‌హెడ్‌, లోగోలు, సంతకాలను మార్ఫింగ్‌ చేసి అధికారిక సమాచారంగా చూపుతూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. దీనిపై ఆగస్టు 24న ప్రెస్‌నోట్‌ విడుదల చేసి, ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అధికారిక ప్రెస్‌నోట్లు, ప్రెస్‌ కాన్ఫరెన్సుల ద్వారా వెలువడే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా పరిగణించాలి. ఇదే తరహాలో సెప్టెంబరు 28న వివిధ వాట్సాప్‌ గ్రూపుల్లో మరో తప్పుడువార్త ప్రచారంలోకి వచ్చింది. స్థానికసంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి మరో 2 నెలల పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తెలిపినట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల రోల్స్‌కు సంబంధించిన కోర్టు కేసుల్లో క్లియరెన్స్‌ వచ్చిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రచారం చేశారు. ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ అంతర్గత ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఈ సమాచారం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది కాదు. ఎన్నికల సంఘం పేరుతో నకిలీ, తప్పుదారి పట్టించే లేదా అనధికార సమాచారాన్ని ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.’’ అని ఎన్నికల సంఘం హెచ్చరించింది.


ఆ ప్రచారంతో సమయం వృథా

తప్పుడు సమాచారాన్ని పదే పదే ప్రచారం చేయడం వల్ల ప్రజలు, మీడియా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారుల్లో గందరగోళం ఏర్పడుతోందని ఎన్నికల సంఘం తెలిపింది. దీనిపై స్పష్టత కోరుతూ పెద్ద సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌ వస్తుండటంతో ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టాల్సిన అధికారులు, సిబ్బంది సమయం వృథా అవుతోందని సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 21, సెప్టెంబరు 28న జరిగిన రెండు ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నకిలీ సమాచారాన్ని ప్రసారం, ప్రచారం చేసిన వ్యక్తులను గుర్తించాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులను కోరింది. బాధ్యులపై ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌-2000, భారతీయ న్యాయ సంహిత-2023తో పాటు సైబర్‌ చట్టాలు, ఇతర చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం కోరింది.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 06:18 AM